త్వరలో ఇంజనీరింగ్‌ కొత్త సీట్లకు అనుమతి?

ABN , First Publish Date - 2021-10-21T09:30:29+05:30 IST

సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతనే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త సీట్లకు అనుమతులను జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

త్వరలో ఇంజనీరింగ్‌ కొత్త సీట్లకు అనుమతి?

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతనే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త సీట్లకు అనుమతులను జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్‌ను పంపించినట్టు సమాచారం. రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఈ ఏడాది కొత్త సీట్ల కోసం ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పలు కాలేజీలు తమ వద్ద ఉన్న కొన్ని విభాగాల్లోని సీట్లను రద్దు చేసుకుని, వాటి స్థానంలో డిమాండ్‌ ఉన్న సీట్లకు అనుమతులను తెచ్చుకున్నాయి. అలాగే.. మరికొన్ని కాలేజీలు కొత్త సీట్లకు కూడా ఏఐసీటీఈ నుంచి అనుమతులను పొందాయి. అయితే, ఈ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో  ఇంజనీరింగ్‌ కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దాంతో కోర్టు కూడా ఈ సీట్లకు అనుమతులను జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ముఖ్యమంత్రి ఆమోదిస్తే.. రాష్ట్రంలో సుమారు 4 వేల సీట్లు రానున్నాయి. దాంతో ఈ సీట్లల్లో చేరే మెరిట్‌ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌ అమలు పర్చాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏడాదికి ప్రభుత్వంపై రూ. 25 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి సంబంధించి ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్‌ను పూర్తి చేశారు.  

Updated Date - 2021-10-21T09:30:29+05:30 IST