రుణ లక్ష్యాల సాధనకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-11-24T05:27:13+05:30 IST

రుణ లక్ష్యాల సాధనకు సహకరించాలి

రుణ లక్ష్యాల సాధనకు సహకరించాలి

బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌

హనుమకొండ రూరల్‌, నవంబరు 23: ప్రభుత్వం అందించే రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో సాధించి, రుణ లక్ష్యాల సాధనకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రైతు పంటరుణాలు, ఎస్‌హెచ్‌జీ, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు, ఆర్థిక అక్షరాస్యత అంశాలపై డీసీసీ బ్యాంకర్ల త్రైమాసిక పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహకారం బ్యాంకింగ్‌ రంగం అందించాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు.

 రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురోగతి సాధించాల్సి ఉందని, రైతులు తమ రుణాలను రెన్యూవల్‌ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అందించే స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో పెండింగ్‌లో ఉన్న యూనిట్లు త్వరగా గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని, ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిన వారికి రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మురళీ మోహన్‌, డీఆర్‌డీవో శ్రీనివా్‌సకుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మాధవీలత, ఎస్‌బీఐ ఆర్‌ఎం హరికృష్ణ, ఆర్‌బీఐ ఎల్‌డీఓ సాయికిరణ్‌, నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్‌, వివిధ బ్యాంకు కంట్రోలర్లు, మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T05:27:13+05:30 IST