రైతులు, మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-10-22T05:14:38+05:30 IST
రైతులు, మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించాలి: కలెక్టర్
వరంగల్ కలెక్టరేట్, అక్టోబరు 21: రైతులు, మహిళా సంఘాలు శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకొని ఆర్థిక పురోగాభివృద్ధి సాధించాలని కలెక్టర్ బి.గోపి అన్నారు. గురువారం లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించి రుణవిస్తరణ మహోత్సవ కార్యక్రమాన్ని ములుగురోడ్‌లోని వెంకటేశ్వర గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ రకాల సబ్సిడీ రంగాలకు యువత, మహిళా సంఘాలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారులు, సూక్ష్మ, మధ్యతరహా రంగాలకు చేయూత అందించేందుకు యూనియన్ బ్యాంకు అందిస్తున్న రుణాలను అందిపుచ్చుకొవాలన్నారు. రుణాలు సరల్ అబ్ ద్వారా వెంటనే మంజూరవుతాయన్నారు. మహోత్సవంలో అన్ని బ్యాంకుల వారు బిజినెస్ స్టాల్స్, సలహా సెంటర్లు ఏర్పాటు చేశారు. రుణ మహోత్సవంలో రూ. 65.8కోట్ల రుణాలను అందించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యజిత్ తెలిపారు. పెద్ద ఎత్తున వాణిజ్య ప్రముఖులు, వ్యాపార రంగాలకు చెందిన వారితో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డితో పాటు యూనియన్ బ్యాంకు జీఎం శంకర్‌లాల్, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యజిత్, ఎస్‌బీఐ డీజీఎం ఆర్.బాల్ ఆనంద్, నాబార్డు డీబీఎం చంద్రశేఖర్, వివిధ బ్యాంకుల ఆర్‌ఎంలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.