కొవిడ్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2021-05-06T05:11:19+05:30 IST

కొవిడ్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు

కొవిడ్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు
ఇంటింటా సర్వే చేస్తున్న వైద్యసిబ్బంది

 ఇంటింటి పరిశీలనతో  కేసుల గుర్తింపు

 రోగుల్లో భయాన్ని తొలగించి భరోసానిచ్చేలా కౌన్సెలింగ్‌

 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కొవిడ్‌ టెస్టులు

 వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌  రాజీవ్‌గాంధీ హన్మంతు

హన్మకొండ అర్బన్‌, మే 5: ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఈమేరకు బుధవారం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘చేజ్‌ ద వైరస్‌’ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రుల్లో ఓపీ విభాగంలో చికిత్స కోసం వచ్చే వారికి, అలాగే ఇంటింటి సందర్శన సమయంలో కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు. వారు కొవిడ్‌ పరీక్ష ఫలితం కోసం వేచి ఉండకుండా వెంటనే చికిత్స ప్రారంభించడం, వారిని ఆరోగ్య పరిస్థితి వాకబు చేయడం, వారిలోని భయాన్ని పోగొట్టి భరోసానిచ్చేలా కౌన్సెలింగ్‌ చేయటం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

ఇంటింటి సందర్శన కోసం పట్టణ ప్రాంతాల్లో ఇద్దరు ఆశా కార్యకర్తలు, ఇద్దరు మునిసిపల్‌ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లక్షణాలున్న వారిని వెంటనే గుర్తించడం, హోం ఐసోలేషన్‌లో ఉంచి కిట్‌ అందించి వెంటనే చికిత్స ప్రారంభింప చేస్తున్నామన్నారు. దీనివల్ల వ్యాధి తీవ్రత తగ్గి ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా ఉంటారని తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని తగ్గించగలుగుతామని వివరించారు. ఇంటింటి సందర్శన ద్వారా ఎవరికీ చెప్పకుండా ఇబ్బందిపడే వారిని కూడా గుర్తించవచ్చన్నారు. నాలుగు రోజుల వరకు జ్వరం, ఇతర లక్షణాలు తగ్గకుంటే వెంటనే సంబంధిత వైద్య అధికారికి తెలపాలని సూచించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్‌ లక్షణాలున్న వారికి కరోనా పరీక్ష ఫలితం కోసం వేచి ఉండకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలన్నారు. 

45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్‌ కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో అనువైన తేదీ, ఆరోగ్య కేంద్రం స్లాట్‌ ఎంపిక చేసుకుని మాత్రమే వాక్సినేషన్‌ కేంద్రాలకు రావాలని చెప్పారు. జిల్లాలో ఆక్సీజన్‌ లభ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఇబ్బంది కలగకుండా చూడడానికి రెవెన్యూ డివిజన్‌ అధికారి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, గుంపులుగా ఉన్నచోటికి వెళ్లకుండా, ఫంక్షన్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2021-05-06T05:11:19+05:30 IST