ప్రజలను బానిసల్లా చూస్తున్న సీఎం

ABN , First Publish Date - 2021-08-21T07:46:18+05:30 IST

తెలంగాణ ప్రజలు తన బానిసలు అన్నట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

ప్రజలను బానిసల్లా చూస్తున్న సీఎం

  • తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు.. 
  • హుజూరాబాద్‌లోనే తొలి అడుగు పడాలి
  • కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా ఈటలదే గెలుపు
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జన ఆశీర్వాద యాత్ర


హనుమకొండ/కమలాపూర్‌/తొర్రూరు/జనగామ/సూర్యాపేట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలు తన బానిసలు అన్నట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కానీ, 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసింది కేసీఆర్‌ కుటుంబానికి ప్రజలు బానిసలుగా ఉండేందుకు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆత్మగౌరవం లేనివారు, బానిసలుగా ఉండేవారు మాత్రమే టీఆర్‌ఎటస్‌లో ఉండాలన్నారు. ఆత్మగౌరవం ఉన్నవారిని ఆ పార్టీలో ఉండనివ్వడంలేదని ఆరోపించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్రవారం మహబూబాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, సూర్యాపేట జిల్లాల్లో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మాట్లాడుతూ.. నేను-నా కుటుంబం అన్నట్లుగా కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును, కేసీఆర్‌ కుటుంబ బానిసత్వం నుంచి విముక్తిని కోరుకుంటున్నారని, ఇందుకు మొదటి అడుగు హుజూరాబాద్‌లోనే పడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ కుటుంబ రాజ్యం, ఎంఐఎం దోస్తులు మాత్రమే ఉంటారని అన్నారు. బీజేపీ రాజకీయంగా ఎంఐఎంకు వ్యతిరేకమే తప్ప.. ముస్లింలకు వ్యతిరేకం కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా ఈటలను గెలిపించుకొని తీరుతామన్నారు.


బడుగులకు మోదీ పెద్దపీట..

ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ చౌరస్తాలో ఆయన ప్రసంగిస్తూ.. కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ విజయం సాధించారన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57 కోట్ల మందికి టీకా ఇచ్చారని, డిసెంబరు నెలాఖరుకల్లా అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చొరవతోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. అంతకుముందు మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో మాట్లాడుతూ.. కరోనా కాలంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా యుద్ధవిమానాల ద్వారా సరఫరా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ ఏడేళ్లుగా నిజాయితీగా పనిచేస్తున్నారని, కానీ.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్లను దండుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నా..ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. హనుమకొండలోని సుప్రసిద్ధ భద్రకాళి ఆలయాన్ని కిషన్‌రెడ్డి సందర్శించారు. అమ్మవారికి పూజలు చేసి పట్టు వస్త్రాలను సమర్పించారు. అక్కడి నుంచి వేయిస్తంభాల గుడికి చేరుకుని రుద్రేశ్వర స్వామివారికి పూజలు చేశారు. కల్యాణ మండపాన్ని సందర్శించారు. కొన్నేళ్లుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తయ్యేందుకు నిధులను కేంద్రం నుంచి మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం సుబేదారిలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అక్కడ నుంచి జనగామ జిల్లాలోకి ప్రవేశించి స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 


పారిశుధ్య కార్మికురాలి ఇంట్లో అల్పాహారం

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న కిషన్‌రెడ్డి.. జిల్లా కేంద్రంలోని కల్నల్‌ సంతో్‌షబాబు విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ ఉత్తమ పారిశుధ్య కార్మికురాలిగా అవార్డు అందుకున్న మెరుగు మారతమ్మ ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి  విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో విధులు నిర్వహించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అందరికీపాదాభివందనాలు చేస్తున్నామన్నారు. కిషన్‌రెడ్డి యాత్రలో పెద్ద సంఖ్యల బీజేపీ కార్యకర్తలు వెంట నడిచారు. ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. కాగా, పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు తొర్రూరులో కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-08-21T07:46:18+05:30 IST