సారొస్తారు..

ABN , First Publish Date - 2021-06-20T08:24:12+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఆదివారం సిద్దిపేట, కామారె డ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పరిశీలించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

సారొస్తారు..

CM visits Siddipet, Kamareddy today


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): సీఎం కేసీఆర్‌ ఆదివారం సిద్దిపేట, కామారె డ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పరిశీలించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సిద్దిపేటకు చేరుకుంటారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సిద్దిపేట శివారులో నిర్మించిన పోలీస్‌ కమిషరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తదుపరి సమీకృత జిల్లా కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేసి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం కామారెడ్డిలో సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవనాన్ని, తదుపరి జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలనూ సీఎం ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, తిరుగు ప్రయాణంలో ఏ గ్రామాన్ని అయినా ఆకస్మికంగా సందర్శించవచ్చనే సమాచారంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది.


వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి

సీఎం కేసీఆర్‌ సోమవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. అక్కడ మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మే 21న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా కేసీఆర్‌ సెంట్రల్‌ జైలును కూడా సందర్శించడం, దానిని కూల్చివేసి ఆ స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించడం తెలిసిందే. అన్నట్లుగానే నెల రోజుల వ్యవధిలోనే సెంట్రల్‌ జైలునుకూల్చివేసి, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ  శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో నిర్మితమైన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాలను సీఎం సోమవారం ప్రారంభించనున్నారు. ధర్మసాగర్‌, ఆత్మకూర్‌, ఐనవోలు మండలాల్లోని పల్లెప్రగతి పనులను తనిఖీ చేసే అవకాశం ఉంది. మధ్యా హ్నం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో సీఎం కేసీఆర్‌ భోజనం చేస్తారు. ఇదిలా ఉండ గా.. ఈ నెల 21న సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన యాదాద్రిలో ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. 


వాసాలమర్రిలో అధికారుల మకాం..

సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకుని అభివృద్ధి చేయ సంకల్పించిన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో అధికార యంత్రాంగం మకాం వేసింది. గ్రామ అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేందుకు కేసీఆర్‌ మంగళవారం వాసాలమర్రికి రానున్నట్టు ప్రకటించడంతో అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం సహపంక్తి భోజనాలు చేసేందుకు, గ్రామాభివృద్ధి ప్రణాళికల అమలుపై చర్చించేందుకు గ్రామసభకు స్థలాలను ఎంపిక చేశారు. దాదాపు 4వేల మందికి భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-20T08:24:12+05:30 IST