సీఎం టూర్‌పై టెన్షన్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2021-06-19T05:51:19+05:30 IST

సీఎం టూర్‌పై టెన్షన్‌ టెన్షన్‌

సీఎం టూర్‌పై టెన్షన్‌ టెన్షన్‌
ధర్మసాగర్‌ మండలం తాటికాయలలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

21న నగరంలో పర్యటించిన అనంతరం ఒక గ్రామాన్ని  సందర్శించే అవకాశం

పల్లెప్రగతి పనులు తనిఖీ చేస్తారని జిల్లా  అధికారులకు సంకేతాలు

తాటికాయల, ఆత్మకూరులో చకచకా అభివృద్ధి పనులు


హన్మకొండ టౌన్‌, జూన్‌ 18: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 21న వరంగల్‌ పర్యటనకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నూతనంగా నిర్మించిన వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు వరంగల్‌ కేంద్ర కారాగారం స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ చేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు ఎమ్మెల్యేలు జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. మూడు రోజులుగా సీఎం కేసీఆర్‌ పర్యటనపై కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.  


పల్లెప్రగతి పనుల తనిఖీ 

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులను సీఎం వరంగల్‌ పర్యటనలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం తాటికాయల గ్రామాన్ని, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రాన్ని సందర్శించే అవకాశాలున్నట్లు అధికారులకు సంకేతాలు అందినట్లు తెలిసింది. ఈ మేరకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌, డీఆర్‌డీవో పీడీ శ్రీనివాస్‌ తదితరులు ధర్మసాగర్‌ మండలంలోని తాటికాయల గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. పల్లెప్రగతి కింద చేపట్టిన డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటిక, రైతువేదిక పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ తాటికాయల గ్రామాన్ని సందర్శిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 


అదేవిధంగా వరంగల్‌ రూరల్‌ జాయింట్‌ కలెక్టర్‌ హరిసింగ్‌ ఆత్మకూరు మండలకేంద్రాన్ని సందర్శించారు. ఆత్మకూరులో మోడల్‌ పోలీ్‌సస్టేషన్‌, డంపింగ్‌యార్డు, గ్రామపంచాయతీ భవన పరిసరాలను పరిశీలించారు. పల్లెప్రగతి పనులను తనిఖీచేసే అవకాశం ఉండడంతో సిబ్బందిని అప్రమత్తం చేశారు. మొత్తంగా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో ఏ గ్రామాన్ని సందర్శించేది అధికారికంగా ఖరారు కానప్పటికీ ఈ రెండు జిల్లాల అధికార యంత్రాంగం మాత్రం కేసీఆర్‌ పర్యటనపై యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్‌, సెంట్రల్‌ జైలు పరిసరాలను సుందరీకరిస్తున్నారు. 


పల్లెప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని సీఎం కేసీఆర్‌ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారుల్లో కలవరం నెలకొంది. ఏ గ్రామాన్ని తనిఖీ చేస్తారో అధికారికంగా ఖరారు కాకపోవడంతో రెండు జిల్లాల కలెక్టర్లు అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. పల్లెప్రగతి పనుల్లో పురోగతి సాధించని పలు మండలాల అధికారుల్లో మాత్రం టెన్షన్‌ నెలకొంది. మొత్తంగా కేసీఆర్‌ పర్యటన అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. 

Updated Date - 2021-06-19T05:51:19+05:30 IST