నేటి సీఎం పర్యటన రద్దు

ABN , First Publish Date - 2021-11-10T04:46:13+05:30 IST

నేటి సీఎం పర్యటన రద్దు

నేటి సీఎం పర్యటన రద్దు

 ఎమ్మెల్సీల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో అమల్లోకి వచ్చిన కోడ్‌

 29న ‘విజయగర్జన’ సభ కూడా వాయిదా పడే అవకాశం

ఓరుగల్లు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎ మ్మెల్సీల ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో  బుధవారం జరగాల్సిన  సీఎం వరంగల్‌  పర్యటన రద్దయిందని టీఆర్‌ఎస్‌ నేతలు, అధికారులు తెలిపారు. వరంగల్‌ నగర అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించడంతో కొత్త పనుల ప్రకటన ఉంటుందని అధికారులు భావించారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 

గతంలో ముఖ్యమంత్రి వరంగల్‌ నగరంలో పర్యటించినప్పుడు సీఎం  వాగ్ధానం చేసిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. సెంట్రల్‌ జైలు కూల్చి వేత అనంతరం అక్కడ నిర్మించబోయే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి డిజైన్‌లను పరిశీలిస్తారని భావించారు. దశాబ్దాలుగా అమలుకు నోచుకోని మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని రోడ్లు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు పనులు తదితర అంశాలపై సమీక్షించే అవకాశం ఉందని అధికారులు భావించారు. నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించడమే కాకుండా అవసరమైన పథకాల పనులను కూడా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు భావించారు.  

గతంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో స మీ క్ష జరుపుతారన్న సమాచారంతో అధికారులు పూర్తి స్థాయి వివరాలతో సిద్ధం గా ఉన్నారు. హైదరాబాద్‌ తర్వాత ఆ స్థాయిలో కార్పొరేట్‌ కంపెనీల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో జిల్లాను సిద్ధంగా చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. సమీక్ష అనంతరం చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తారన్న సమాచారంతో అవసరమైన ఏర్పాట్లకు సిద్ధమైయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని అధికారులు చె బుతున్నారు. దీంతో కొత్త పథకాలు, హామీలు ప్రకటించే అవకాశాలుండవని అధికారులు తెలిపారు. దీంతో సీఎం పర్యటన రద్దయిందంటున్నారు.

విజయగర్జన సభ కూడా రద్దు..? 

ఈ నెల 29న హనుమకొండలోని దేవన్నపేటలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన టీఆర్‌ఎస్‌ విజయగర్జన సభ కూడా రద్దయ్యే అవకాశం ఉందని సమాచారం. దేవన్నపేట గ్రామ పరిధిలో దాదాపు 300 ఎకరాల్లో 10లక్షల మందితో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సభ నిర్వహణ కోసం తమ పంట పొలాలను తొలగించేందు కు తాము ఒప్పుకోమని రైతులు మొదట్లో ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌  స్థానిక రైతులతో మాట్లాడి నష్టపరిహారం ఇస్తామని నచ్చచెప్పారు. ఇప్పటికే చాలా మంది రైతులకు నష్టపరిహారం అందించినట్టు టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. ఈ క్రమం లో సభ నిర్వహణ కోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మంగళవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల ప్రకటన వెలువడడంతో విజయగర్జన సభ నిర్వహణ సందిగ్ధంలో పడింది.

Updated Date - 2021-11-10T04:46:13+05:30 IST