సారొస్తున్నారు..

ABN , First Publish Date - 2021-06-21T05:36:44+05:30 IST

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరంగల్‌ నగరంలో సోమవారం పర్యటించనున్నారు. నగరంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో పాల్గొననున్నారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలం లో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

సారొస్తున్నారు..
వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ సముదాయం, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం చదును చేస్తున్న స్థలం, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరిపాలన భవనం

సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన నేడే..
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన
వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయం, కాళోజీ విశ్వవిద్యాలయ భవనాల ప్రారంభం
పల్లె ప్రగతి పనులను తనిఖీ చేసే అవకాశం
విస్తృత ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం
భారీ పోలీసు బందోబస్తు.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు


వరంగల్‌ అర్బన్‌, జూన్‌ 20 (ఆం ధ్రజ్యోతి ప్రతినిధి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరంగల్‌ నగరంలో సోమవారం పర్యటించనున్నారు. నగరంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో పాల్గొననున్నారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలం లో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే ధర్మసాగర్‌, ఐనవో లు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఆత్మకూరు మం డలాల్లోని పల్లెప్రగతి పనులను తనిఖీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరు ణ్‌ జోషి ఆధ్వర్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన క్రమంలో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. నగర సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

24 అంతస్థుల మేడ..
వరంగల్‌ సెంట్రల్‌జైలు స్థలంలో నూతనంగా నిర్మించతలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి బహు ళ అంతస్తుల భవనంగా ఉండబోతోంది. ఏకంగా 24 అంతస్థులతో నిర్మిస్తున్నారు. ఎయిర్‌ అంబులెన్సుల కోసం భవనంపైన హెలికాప్టర్‌ దిగేందుకు హెలీపాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే తరాలకు అన్నిరకాల వైద్యసేవలు అం దించే విధంగా అత్యాధునిక ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ఇప్పటికే జాతీయస్థాయి కన్సల్టెంట్లను సంప్రదించి బిల్డింగ్‌  డిజైన్‌, నిర్మాణం అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం
రూ.57కోట్ల వ్యయంతో నిర్మించిన రెండంతస్థులు వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం సోమవారం ప్రారంభిస్తారు. దాదాపు 13ప్రభుత్వ శాఖలకు సంబంధించిన  కార్యాలయాలు ఇందులోనే ఉంటాయి. 200 మం దితో ఒకేసారి సమావేశం నిర్వహించే సామర్థ్యం కలిగిన సమావేశ మందిరంతో పాటు ప్రత్యేకంగా జిల్లాకు చెందిన మంత్రికి సైతం చాంబర్‌ కూడా ఇందులో ఉంటుంది. దీంతో పాటు ప్రారంభించే కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయ కోసం చాలా కాలం కిందటే ఐదంతస్థుల భవనం నిర్మించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని ఇంతకాలం ఎదురు చూశారు. సోమవారం సీఎం భవనాన్ని ప్రారంభిస్తారు.

కడియం ఇంట్లో భోజనం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాజీ ఉప ముఖ్యమం త్రి కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇటీవలనే శ్రీహరి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయింది. అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవీ కాలం అనంతరం కడియం శ్రీహరికి ప్రాధాన్యత కలిగిన పదవి లేకుండా పోయింది. దీంతో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌ విందు భోజనంతో కడియం శ్రీహరికి మరోసారి సముచిత స్థానం దక్కే అవకాశం ఉందన్న ఆశాభావంతో శ్రీహరి అభిమానులు ఉన్నారు.. కాగా, కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనకు వచ్చారంటే రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఇంట్లో భోజనం చేయడం, బస చేయడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా ఈసారి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటికి మధ్యాహ్న భోజనానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆకస్మిక తనిఖీలు
పల్లె ప్రగతి పనుల ప్రగతిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌ ఆకస్మికంగా గ్రామ సందర్శన చేసే అవకాశం ఉందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ధర్మసాగర్‌, ఐనవోలు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఆత్మకూరు మండలాల్లోని గ్రామాల్లో ఏదో ఒక గ్రామాన్ని తనిఖీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.. దీంతో అధికారులు 4 రోజులుగా ఆ గ్రామాలను సందర్శించి ప్రగతిని సమీక్షిస్తున్నారు..

సీఎం పర్యటన ఇలా..

ఉదయం 10.30 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌లో హెలీకాప్టర్‌ దిగుతారు.
10.40 గంటలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ నుంచి బయలు దేరుతారు
11.00 గంటలకు వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలానికి చేరుకొని అక్కడ 24 అంతస్తుల మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
11.30 గంటలకు అక్కడి నుంచి బయలు దేరుతారు.
11.35 గంటలకు కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయం క్యాంప్‌సకు చేరుకుంటారు. పరిపాలనా భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు.
11.50 గంటలకు అక్కడి నుంచి బయలు దేరుతారు.
మధ్యాహ్నం 12.10 గంటలకు సుబేదారిలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు.
2.30 గంటలకు అక్కడి నుంచి బయలు దేరుతారు.
2.40 గంటలకు సుబేదారి టీచర్స్‌కాలనీలోని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేస్తారు.
3.10 గంటలకు అక్కడి నుంచి బయలు దేరుతారు.
3.15 గంటలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు.
3.20 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు బయలు దేరుతారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్రంపై  స్పష్టత ఇచ్చేనా..?

ఇటీవలికాలంలో మరోసారి కొత్తజిల్లాల ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. ఒకవైపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో హుజురాబాద్‌ కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జోరందుకున్నది. అదే విధంగా ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలేని వరంగల్‌ రూరల్‌ జిల్లాకు జిల్లా కేంద్రం ఏర్పాటు అంశాన్ని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్‌ నియోజకవర్గం కేంద్రంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాను ప్రకటించే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ కేంద్రంగా హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తారన్న ప్రచారం ఉంది.. ఈ అంశంపై కేసీఆర్‌ స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు.


సారూ.. జర సూడూ..

కలగా మిగిలిన కాళోజీ కళాక్షేత్రం
హన్మకొండ బాలసముద్రంలోని హయగ్రీవచారి మైదానంలో ఏడేళ్ల కిందట చేపట్టిన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. 2014 సెప్టెంబర్‌ 9వ తేదీన సీఎం కాళోజీ కళా క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిని మించి అత్యంత అధునాతనమైన రీతిలో ప్రజలను విశేషంగా ఆకట్టుకునే రీతిలో భవనాన్ని డిజైన్‌ చేశారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల కాళోజీ కళాక్షేత్రం ఇప్పటివరకు పూర్తి కాలేక పోయింది. సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు కాళోజీ అభిమానులు ప్రయత్నిస్తున్నారు.Updated Date - 2021-06-21T05:36:44+05:30 IST