రాజకోట నుంచి రహస్యాలు బయటకు వస్తుండటంతో..!
ABN , First Publish Date - 2021-03-12T18:30:29+05:30 IST
సీఎం కేసీఆర్.. మైండ్‌లో ఏదనుకుంటే బ్లైండ్‌గా అదే ఫాలో అవుతారంటారు.
సీఎం కేసీఆర్.. మైండ్‌లో ఏదనుకుంటే బ్లైండ్‌గా అదే ఫాలో అవుతారంటారు. నమ్మినవారిపై అనుమానం వస్తే ఏమాత్రం సంకోచించకుండా అప్పటికప్పుడు దూరం పెట్టడం ఆయన నైజం. ఆయనకు దగ్గరగా రాసుకుపూసుకు తిరిగి అంతామేమే అన్నట్లు కనిపించిన ఎందరో ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కనుమరుగైపోయారు. కోరి కోరి కట్టుకున్న ప్రగతి భవన్ రాజకోట నుంచి రహస్యాలు బయటకు వస్తుండటంతో అంతపురంలో రహస్య వేగుల భరతం పడుతున్నారనే టాక్ వస్తోంది. ఇప్పటికే ఓ వికెట్ పడిపోగా మరో రెండు వికెట్లు రెడీగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
లీకు వీరులను ఏరిపారేయాలని..!
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం నిలుపుకుని ఎదురులేని మనిషిగా నిలిచారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఈ మధ్య కాలం నుంచి మొదలవుతున్న ఎదురుదెబ్బల వెనక తనమనుషులే ఉన్నారనే నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినట్లు న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. రాజకోటలో ఉంటూ రహస్యాలను ప్రత్యర్థులకు గూడచర్యం చేస్తున్నారనే అనుమానాలు ఎక్కువయిపోయాయి. లీకు వీరులను ఏరిపారేయాలనుకున్న సీఎం కేసీఆర్ తన నిర్ణయాలను వేగంగా అమలు చేస్తున్నారనే టాక్ వస్తోంది. ప్రగతి భవన్ కోటలో ఎవరెవరు ఏం చేస్తున్నారని దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. వచ్చిపోయేవారు ఏమేం బయటకు మోసుకెళ్తున్నారనేది ఇప్పటికే తెలుసుకున్నారట.
మరో ఇద్దరు నేతలు కూడా..!
ప్రగతి భవన్ ముచ్చట్లు బయటకు చెప్పడం.. కోవర్ట్ పాలిటిక్స్ చేయడం, అవినీతి మరకలు అంటించుకోవడం, తన పేరును వాడుకోవడం ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా పనులు చక్కబెట్టుకోవడం పెద్దాయనకు మొత్తం తెలిసిపోయాయట. నమ్మినబంటుగా ముద్రపడ్డ పీఆర్‌వో గటిక విజయ్‌కుమార్‌ను సాగనంపడం ఆపరేషన్ గూడచర్యంలో భాగమే అన్న చర్చ జరుగుతోంది. ఇదే బాటలో మరో ఇద్దరు నేతలు తొలి వరుసలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

టాక్ ఇదీ..
సీఎంగా ఫస్ట్ పీరియడ్ తొలినాళ్లలో వరంగల్‌కు జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఎలా సాగనంపారో చరిత్ర మరువదు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయో ఆయన చుట్టూ ఉండేవారికి అట్టే తెలిసిపోతుంది. ఇమేజ్ డ్యామేజ్ చేసేవారు ఎంత పెద్దవారైనా ఏ మాత్రం సంకోచించకుండా నిర్దాక్షిణ్యంగా సాగనంపడం ఆయన స్టైల్. నమ్మితే ఆకాశానికెత్తే కేసీఆర్‌కు నమ్మక ద్రోహం చేసే వ్యక్తులను అదఃపాతాళానికి నెట్టిపారేయడం తెలుసని ఆయన చుట్టూ ఉండేవారు అనుకునేమాట. తన అనుకునేవారిని కించపర్చేలా మాట్లాడితే అస్సలు సహించని కేసీఆర్.. వేటు వేయడానికి ఏమాత్రం సంకోచించరనే టాక్ ఉంది.

ఊస్టింగ్ లిస్ట్ రెడీ!
ఉద్యమ నేపథ్యం ఉన్న ఓ మాజీ ఎమ్మెల్సీ కూడా కేసీఆర్ ఊస్టింగ్ లిస్ట్‌లో ఉన్నారనే చర్చ గులాబీ దళంలో వినిపిస్తోంది. జిల్లా నుంచి ఎంతమంది వ్యతిరేకించినా తన మనిషిగా అనుకుని సదరు నేతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. ఎప్పటినుంచో సదరు మాజీ ఎమ్మెల్సీపై ఆరోపణలువచ్చినా పదవీకాలం పూర్తయ్యేవరకు ఓపిక పట్టి నజర్ పెట్టిన కేసీఆర్..ఇప్పుడు పూర్తిగా పక్కనబెట్టే నిర్ణయానికి వచ్చారట. ఎంతలా అంటే ప్రగతి భవన్ గేట్ల దగ్గరే ఆపేసేంతగా.

కేటీఆర్ టీమ్‌పై కూడా కేసీఆర్ ఫోకస్!
మంత్రి కేటీఆర్ టీమ్‌పై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు ప్రగతిభవన్ పాలిటిక్స్ తెలిసినవారు అనుకునేమాట. ఆరోగ్యం సహకరించినన్నాళ్లు సీఎంగా తానే ఉంటానని ఇప్పటికే పలుమార్లు చెప్పిన కేసీఆర్.. ఇంటి గుట్టు విప్పుతున్న అనుంగు శిష్యుల పనిపట్టే పనిలో బిజీగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఒక్కరు పోయారు..ఇద్దరు లిస్టులో ఉన్నారు. ఇంకొందరి లిస్ట్ రెడీ అవుతోందని మదనపడుతున్న నేతలు తమ చిట్టా సారు దగ్గరికి చేరిందని భయం భయంతో వణికిపోతున్నారట. కేసీఆర్ ఎవరి మాటా వినరు.. ఎవరిని నమ్మరు..ఆయనో సీతయ్య.. అంటుంటారు ఆయన గురించి తెలిసినవాళ్లు.. తప్పు చేసి ఆయన దగ్గరికి వెళితే నిప్పుతో చెలగాటం ఆడటమే అంటుంటారు ఆయన పొలిటికల్ స్ట్రాటజీ తెలిసిన పొలిటీషియన్లు.

