ఫిట్‌మెంట్‌ ఎంత ఇద్దాం!

ABN , First Publish Date - 2021-02-05T08:21:11+05:30 IST

ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ఎంత పెంచుదాం? ఎంత పెంచితే ప్రభుత్వంపై ఎంత మేరకు భారం పడుతుంది? అని సీఎం కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది...

ఫిట్‌మెంట్‌ ఎంత ఇద్దాం!

  • ఎంత పెంచితే.. సర్కారుపై ఎంత భారం?
  • ఆర్థిక శాఖ అధికారులతో కేసీఆర్‌ సమీక్ష
  • రిటైర్మెంట్‌ వయసు పెంపుపైనా చర్చ
  • రాష్ట్ర బడ్జెట్‌పై అధికారులకు సూచనలు
  • వారంలో ఫిట్‌మెంట్‌ ప్రకటించే అవకాశం
  • నేడు ఇరిగేషన్‌ బడ్జెట్‌పై సీఎం సమీక్ష!


హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ఎంత పెంచుదాం? ఎంత పెంచితే ప్రభుత్వంపై ఎంత మేరకు భారం పడుతుంది? అని సీఎం కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. గురువారం ఆయన ఆర్థికశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక, కేంద్ర బడ్జెట్‌లోని అంశాలు, రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను త్వరగా ప్రకటించేలా ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం.


ఫిట్‌మెంట్‌ను 7.5 శాతమే ఇవ్వాలని పీఆర్సీ సూచించడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మరోవైపు వారం రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉండడంతో.. ప్రభుత్వం అంతకుముందే ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని అధికారులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును కూడా ఫిట్‌మెంట్‌తోపాటే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారంలోపు దీనిపై ప్రకటన చేయకపోతే.. వరుసగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, మునిసిపల్‌ ఎన్నికల కోడ్‌ కారణంగా ఇది ఏప్రిల్‌ దాకా వాయిదా పడే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు రావచ్చనే విషయంపై అధికారులతో సీఎం చర్చించినట్టు సమాచారం. దీంతోపాటు వచ్చే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఏ విధంగా రూపొందించాలనే అంశంపై కూడా అధికారులకు సీఎం సూచనలు చేసినట్టు తెలిసింది.


నేడు ఇరిగేషన్‌ బడ్జెట్‌పై సీఎం సమీక్ష!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేటాయించే నిధులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం అఽధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున ఇరిగేషన్‌ ప్రాజెక్టులను నిర్మిస్తుండడంతో.. ఇందుకు ఏటా బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలు కూడా తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు భారీగానే కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. లిప్టు ప్రాజెక్టులకు ఉపయోగిస్తున్న విద్యుత్తు సరఫరాకు పెద్ద ఎత్తున బిల్లులనూ చెల్లించాల్సి ఉంది. బడ్జెట్‌ కేటాయింపులకు సంబంఽధించి ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటికే ప్రతిపాదలు సిద్ధం చేశారు. వచ్చే ఏడాది రూ.25 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్ల నిధులు కేటాయించాలని ఈ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. శుక్రవారం సమీక్షలో ముఖ్యమంత్రి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Updated Date - 2021-02-05T08:21:11+05:30 IST