మీకు.. నేనున్నా

ABN , First Publish Date - 2021-05-20T08:10:32+05:30 IST

సీఎం కేసీఆర్‌ బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి పీపీఈ కిట్‌ ధరించకుండా, కేవలం డబుల్‌ మాస్క్‌తోనే వెళ్లారు.

మీకు.. నేనున్నా

  • అన్నీ చూసుకుంటాను..
  • అధైర్యపడొద్దు.. 
  • కరోనా బాధితులకు సీఎం కేసీఆర్‌ భరోసా
  • గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి
  • వైద్య శాఖ పోర్ట్‌ఫోలియోతో తొలిసారి
  • పీపీఈ వేసుకోకుండా.. డబుల్‌ మాస్క్‌తోనే
  • పడకల వద్దకు వెళ్లి రోగులకు పలకరింపు
  • ఆరు వార్డులను కలియతిరిగిన సీఎం
  • వైద్యులు, నర్సుల సేవలకు ప్రశంసలు
  • ఏ సమస్యలున్నా పరిష్కరిస్తానని హామీ
  • రేపు వరంగల్‌ ఎంజీఎం సందర్శనకు సీఎం


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి పీపీఈ కిట్‌ ధరించకుండా, కేవలం డబుల్‌ మాస్క్‌తోనే వెళ్లారు. అలాగే నేరుగా కరోనా రోగుల వద్దకు వెళ్లారు. ప్రతి పడక వద్దకు వెళ్లి పలకరించారు. ‘‘ఆరోగ్యం ఎలా ఉంది? ఆస్పత్రిలో బాగా చూస్తున్నారా? మందులు మంచిగా ఇస్తున్నారా? భోజనం బాగా పెడుతున్నారా?’’ అంటూ ప్రశ్నించారు. ‘‘మీకేమీ కాదు.. నేనున్నాను.. అన్నీ చూసుకుంటాను. అధైర్యపడకండి’’ అంటూ రోగులకు భరోసానిచ్చారు. వారిలో మానసిక స్థయిర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. దాదాపు 15 మంది రోగులతో సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి పలకరించిన వారిలో చాలా మంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారే ఉన్నారు. ఒక్కమాట మాట్లాడితేనే ఆయాసంతో తల్లడిల్లిపోతున్నారు.


ఇలా ఆక్సిజన్‌ పెట్టుకొని చికిత్స పొందుతున్న తాండూర్‌కు చెందిన ఓ బాధితుడు సరిగా మాట్లాడలేకపోవడంతో సీఎం ఆ రోగి దగ్గరకు వెళ్లి వంగి మరీ పలకరించారు. వికారాబాద్‌కు చెందిన మరో వ్యక్తితో, ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో, మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ గర్భిణితో, యాచారానికి చెందిన ఓ ఉపాధ్యాయుడితో.. ఇలా పలువురితో ముఖ్యమంత్రి మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ‘‘ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. డాక్టర్లు ఇక్కడే ఉన్నారు.. వెంటనే పరిష్కరిస్తారు. ఎవరూ భయపడొద్దు.. అందరికీ బాగవుతుంది. నయమైన తర్వాత మంచిగా ఇంటికి పోండి’’ అని కేసీఆర్‌ అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, మందుల విషయంలో జాప్యం చేయకుండా వెంటనే ఏర్పాట్లు చేయాలని సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశాడు.


కాగా, ఆస్పత్రిలో ప్రస్తుతం 1498 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో కొంత మంది మాత్రమే వెంటిలేటర్లు, ఆక్సిజన్‌పై ఉన్నారని సీఎంకు సూపరింటెండెంట్‌ తెలిపారు. ప్రతి రోజు 50 నుంచి 80 వరకు చికిత్స పొందుతున్న రోగులు డిశ్చార్జి అవుతున్నారని సీఎంకు వివరించారు ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన తరువాత వైద్య ఆరోగ్యశాఖను తనవద్దే ఉంచుకున్న సీఎం కేసీఆర్‌.. తొలిసారి ఆ పోర్ట్‌ఫోలియోతో గాంధీ ఆస్పత్రికి వెళ్లారు.  ఐసీయూ, ఎమర్జెన్సీ, ఔట్‌ పేషెంట్‌ వార్డులు సహా ఆరు వార్డులను సీఎం కలియతిరిగారు. ప్రశ్నలు వేశారు. కొవిడ్‌ ఔట్‌ పేషంట్ల వార్డునుంచి క్యాజువాల్టీ మీదుగా ఆస్పత్రి వెనుక వైపు ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్‌ వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆక్సిజన్‌ ఏ మేరకు సరఫరా అవుతుందని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సులు, జూనియర్‌ డాక్టర్లతో మాట్లాడారు. కరోనా రోగులకు వారు చేస్తున్న సేవలను సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. ‘‘‘క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఈసేవలను ఇలాగే కొనసాగించండి. మీకు ఏ సమస్య ఉన్నా, అవసరం ఉన్నా నా దృష్టికి తీసుకురండి. సంపూర్ణ  సహకారం అందిస్తా’’ అని అన్నారు. జూనియర్‌ డాక్టర్లు, కాంట్రాక్ట్‌ నర్సుల సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.


సీఎం ను కలువనీయలేదు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి లక్ష్మీపతి ఆవేదన

అడ్డగుట్ట: ‘‘రూ.8,500 ల వేతనంలో మా కుటుంబాలను నెట్టుకురాలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. దయనీయ స్థితిలో అల్లాడుతున్న మా సమస్యలను సీఎం కేసీఆర్‌కు చెబుదామనుకుంటే.. పోలీసులు అడ్డుకుని తమను గదిలో బంధించారు’’ అని  గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో పని చేస్తున్న లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు.  కేసీఆర్‌ గాంధీకి వస్తున్నారని, జీతాలు విషయంపై చెప్పుకుందామనుకున్నామంటే.. తనను, మహిళా ఉద్యమ కార్మికురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకొని గాంధీ పోలీసు ఔట్‌పోస్టులోని గదిలో బంధించారని చెప్పారు. కేసీఆర్‌ వెళ్లిపోయిన కొద్ది సేపటికే తమని బయటికి పంపించారని తెలిపారు.


సీఎం రాకతో ఆస్పత్రి క్లీన్‌

అడ్డగుట్ట: సీఎం రాక నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులతో పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయించారు. ఇప్పటిదాకా వార్డుల్లో చెత్త చెదారం నిండిపోయినా ఎవరూ పట్టించుకోలేదని రోగులు అన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు సీఎం కాన్వాయ్‌ రెండు వాహనాలు తప్ప.. మిగతావారిని ఆస్పత్రి ఆవరణలో ఉన్న గాంఽధీ విగ్రహం వద్ద ఆపేశారు. మీడియా ప్రతినిధులెవరినీ లోపలికి అనుమతించలేదు. సీఎం కేసీఆర్‌ బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించి వెళ్తున్న సందర్భంగా అటుగా వచ్చిన అంబులెన్స్‌ను పోలీసులు కొద్దిసేపు నిలిపివేశారు. సీఎం కాన్వాయ్‌ సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలోకి చేరగానే రైల్వేస్టేషన్‌ వైపు నుంచి 108 అంబులెన్స్‌ వచ్చింది. దీనిని నిలిపివేయడంతో ఓ పోలీస్‌ అధికారి గమనించి అంబులెన్స్‌ను అనుమతించాలని గట్టిగా కేకలు వేశారు. దీంతో వెంటనే అంబులెన్స్‌ను పంపించారు.


రేపు వరంగల్‌ ఎంజీఎంకు సీఎం

హన్మకొండ టౌన్‌: సీఎం కేసీఆర్‌ శుక్రవారం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్నట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో మాదిరిగానే ఎంజీఎంలోనూ కరోనాకు చికిత్స పొందుతున్న వారితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కానీ, సీఎం పర్యటన తేదీలో స్వల్ప మార్పులకు అవకాశాలున్నా.. పర్యటన మాత్రం ఉంటుందని అధికార పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.

Updated Date - 2021-05-20T08:10:32+05:30 IST