రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించండి

ABN , First Publish Date - 2021-03-24T08:35:14+05:30 IST

శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదంటూ ఆ పార్టీ శాసనసభాపక్షం మంగళవారం నిరసన వ్యక్తం చేసింది.

రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించండి

  • మాట్లాడేందుకు మాకూ అవకాశమివ్వండి
  • స్పీకర్‌ పోచారానికి సీఎల్పీ విజ్ఞప్తి 
  • సభలో మాట్లాడనివ్వట్లేదంటూ నల్ల కండువాలతో నిరసన 
  • తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ: భట్టివిక్రమార్క

హైదరాబాద్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదంటూ ఆ పార్టీ శాసనసభాపక్షం మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో  ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తొలుత అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద నల్ల కండువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి శాసనసభకు పాదయాత్రగా వెళ్లారు. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తూ సభలో తమ హక్కులు కాపాడాలంటూ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. సభ సజావుగా నడవాలని తాము అన్ని విధాలుగా స్పీకర్‌కు సహకరిస్తున్నామని, కానీ ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై సభలో తనను మాట్లాడనీయకుండా అర్ధంతరంగా మైక్‌ను కట్‌ చేస్తుండడం అవమానకరమని వినతిపత్రంలో పేర్కొన్నారు. 


గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన సందర్భంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసి ఫొటో తీయించుకునేందుకు ప్రయత్నించగా అంగీకరించలేదన్నారు. సోమవారంనాడూ బడ్జెట్‌పైన చర్చ సందర్భంగా సీఎల్పీ నేతగా వివరణ అడిగితే మైక్‌ను కట్‌ చేశారని, ఇది తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. సభలో మాట్లాడేందుకు తమకూ అవకాశం కల్పించాలని కోరారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద మీడియాతో భట్టివిక్రమార్క మాట్లాడారు. శాసనసభలో ప్రతిపక్ష నేతనే ఆత్మగౌరవంతో మాట్లాడలేని పరిస్థితి నెలకొందని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం పచ్చిగా ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎ్‌సలో విలీనం చేసుకున్నప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ సభలో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, తమ గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. స్పీకర్‌ను కలిసి అనేకసార్లు విన్నవించినా న్యాయం జరగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-03-24T08:35:14+05:30 IST