వరంగల్‌ భద్రకాళి ఆలయ సన్నిధిలో సీజేఐ

ABN , First Publish Date - 2021-12-20T05:01:37+05:30 IST

వరంగల్‌ భద్రకాళి ఆలయ సన్నిధిలో సీజేఐ

వరంగల్‌ భద్రకాళి ఆలయ సన్నిధిలో సీజేఐ
భద్రకాళి దేవాలయంలో పూజలు చేస్తున్న సీజేఐ ఎన్వీ రమణ

అమ్మవారికి ప్రత్యేక పూజలు

వేయిస్తంభాల ఆలయంలోనూ..

ఆలయ శిల్ప సంపద అద్భుతమని కితాబు

హనుమకొండ కల్చరల్‌, డిసెంబరు 19: భద్రకాళి దేవాలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ దంపతులు ఆదివారం సందర్శించారు. వీరికి ఆలయ ఈవో కె.శేషుభారతి, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర న్యాయమూర్తుల వెంట వరంగల్‌ పోర్టుపోలియో జడ్జి నవీన్‌రావు,  సుధ, సుమలతలు ఉన్నారు. న్యాయమూర్తులు తొలుత ఆదిశంకరాచార్యయలను, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజాదికాలు జరిపారు. దాదాపు అరగంట పాటు నిర్వహించిన అమ్మవారి అర్చనను న్యాయమూర్తులు తిలకిస్తూ మైమరిచి పోయారు. పూజానంతరం ప్రధానార్చకుడు న్యామూర్తులకు అమ్మవారి శేషవస్త్రాలను బహూకరించారు. వేదపండితులు మహదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందచేశారు. ఆలయ చరిత్రను న్యాయమూర్తులకు ప్రధానార్చకుడు భద్రకాళి శేషు వివరించారు. ఆలయ ఈవో శేషుభారతి, దేవాదాయ ధర్మదాయ శాఖ అదనపు కమిషనర్‌ కూరాకుల జ్యోతి చరిత్ర పుస్తకాలను, అమ్మవారి తైలవర్ణ చిత్రాలను అందచేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి జె.శ్రీనివాసరాజు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు.

ఆలయ శిల్ప సంపద అద్భుతమని కితాబు

హనుమకొండలోని చారిత్రకంగా సుప్రసిద్ధమైన వేయిస్తంభాలగుడిని సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్‌వీ రమణ, తెలంగాణ  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర దంపతులు, జిల్లా పోర్టు పోలియో జడ్జి నవీన్‌ రావు సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ ఆలయ పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తులు తొలుత  ఉత్తిష్ణ గణపతి దర్శనం చేసి అనంతరం రుద్రేశ్వర స్వామికి లఘున్యాస పూర్వక, నమ క, చమకాదులతో పంచామృతాభిషేకం,  నవరాసాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు ఆలయ నాట్య మండపంలో న్యాయమూర్తులకు పట్టు వస్త్రా లు, అంద చేశారు. మహదాశీర్వచనం జరిపారు. ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. రమణీయమైన ఆలయ శిల్ప సందను చూసి సీజేఐ రమణ అబ్బురపడ్డారు. వాటిని చెక్కిన నైపుణ్యాన్ని చేసి ఆశ్చర్యపోయారు. నందీశ్వరుడి సన్నిధిలో న్యాయమూర్తులు ఫొటోలు దిగారు. 

Updated Date - 2021-12-20T05:01:37+05:30 IST