పౌరహక్కుల న్యాయవాది చల్లా కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-20T07:28:49+05:30 IST

గరీబోళ్ల వకీలుగా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సీనియర్‌ న్యాయవాది, పౌరహక్కుల పరిరక్షణ కోసం తుది వరకు పరితపించిన చల్లా నరసింహారెడ్డి(93)ఇకలేరు.

పౌరహక్కుల న్యాయవాది చల్లా కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): గరీబోళ్ల వకీలుగా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సీనియర్‌ న్యాయవాది, పౌరహక్కుల పరిరక్షణ కోసం తుది వరకు పరితపించిన చల్లా నరసింహారెడ్డి(93)ఇకలేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. నరసింహారెడ్డి స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా రెడ్డిపాలెం. ఆయన అలహాబాద్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం, ఎంఏ ఇంగ్లిష్‌ అభ్యసించారు. విద్యార్థి దశలోనే సామ్యవాద సిద్ధాంతం పట్ల ఆకర్షితుడై స్వాతంత్ర్యోద్యమంలోనూ, అనంతరం రైతాంగ సాయు ధ పోరాటంలోనూ పరోక్షంగా పనిచేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆదేశాల మేరకు 1950వ దశకంలో సిద్దిపేటలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అదే నియోజకవర్గం నుంచి 1967లో కమ్యూనిస్టు పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 


ఎమర్జెన్సీ సమయంలో గిరాయిపల్లి ఎన్‌కౌంటర్లకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను సేకరించి భార్గవ కమిషన్‌ ముందు ఉంచడంలో నరసింహారెడ్డి ముఖ్యపాత్ర పోషించారు. ప్రఖ్యాత కమ్యూనిస్టు యోధుడు కొండపల్లి సీతారామయ్యకు సన్నిహితంగా మెలిగిన నరసింహారెడ్డి బెంగుళూరు, రాంనగర్‌ కుట్ర కేసులను వాదించారు. ప్రముఖ న్యాయవాది కేజీ కన్నబిరన్‌తో కలిసి పౌరహక్కుల పరిరక్షణ కోసం పనిచేశారు. పేదల తరఫున కొన్నివందల కేసులు వాదించి న్యాయాన్ని పరిరక్షించిన చల్లా తనకు గురుసమానులని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో బుఽధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిసినట్లు ఆయన కుమారుడు శేషురెడ్డి తెలిపారు. తెలంగాణ మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతా్‌పరెడ్డి, నందిని సిధారెడ్డి, వీక్షణం సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌ తదితరులు నరసింహారెడ్డికి నివాళులర్పించారు. 

Updated Date - 2021-05-20T07:28:49+05:30 IST