కరోనాతో గేమ్స్!
ABN , First Publish Date - 2021-05-20T08:32:07+05:30 IST
కరోనా నేపథ్యంలో నిన్న, మొన్నటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించిన విషయం తెలిసిందే.

- వైరస్ వాహకులుగా మారుతున్న పిల్లలు
- కలిసి ఆడుకుంటూ అంటించుకుంటున్న వైనం..
- వారి నుంచి ఇంట్లో పెద్దవాళ్లకు వైరస్ వ్యాప్తి
- కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పెరుగుతున్న కేసులు..
- అప్రమత్తంగా లేకుంటే ఆగమే: డాక్టర్లు
- ఏప్రిల్ 1 నుంచి 2935 మంది పిల్లలకు కరోనా
హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసముంటున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆరేళ్ల కూతురు.. రోజూ ఎదురింటి పిల్లలతో ఆడుకుంటోంది. 3 రోజుల క్రితం ఆ పాపకు జ్వరం వచ్చింది. ఎందుకైనా మంచిదని పాపతోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా టెస్టు చేయించుకున్నారు. పాపకు, తల్లికి కరోనా పాజిటివ్ వచ్చింది. కారణమేంటని ఆరా తీస్తే.. ఎదురింట్లో నలుగురికి వారం క్రితం కరోనా వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడా తండ్రి డ్యూటీకి సెలవు పెట్టి భార్య, బిడ్డను ఓ గదిలో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో బాగా పేరొందిన అపార్ట్‌మెంట్ అది. అందులోనివారు కొన్ని రోజులుగా కఠిన కట్టడి ఆంక్షలు పాటిస్తున్నారు. మొత్తం 80 ఫ్లాట్లలోని వారు బయటకు అసలే వెళ్లొద్దని తీర్మానించుకుని 15 రోజుల క్రితమే కిరాణా సామగ్రి, కూరగాయలు తెచ్చుకున్నారు. అయినా ఆ ఫ్లాట్లలోని ఒక బాలుడికి ఐదు రోజుల క్రితం ఒళ్లునొప్పులు, దగ్గుతో జ్వరం వచ్చింది. టెస్టు చేయిస్తే పాజిటివ్ వచ్చింది. అనుమానం వచ్చి.. అతడితో కలిసి రోజూ సెల్లార్‌లో క్రికెట్ ఆడుతున్న 9 మంది పిల్లలకు టెస్టు చేయిస్తే వారిలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే.. వారిలో ఇద్దరు పిల్లలు ఆన్‌లైన్‌లో క్రికెట్ బంతిని ఆర్డర్ చేశారు. బాల్ వచ్చాక దాంతో క్రికెట్ ఆడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ నుంచి వారికి వైరస్ సోకి ఉంటుందని అపార్ట్‌మెంట్‌వాసులు నిర్ధారణకు వచ్చారు.అభంశుభం తెలియని పిల్లలు ఆడుకునే సమయంలో వైరస్ బారిన పడుతున్న వైనమిది. వారి నుంచి ఇంట్లో పెద్దలకు కూడా సోకుతుండడంతో కేసులు బాగా పెరుగుతున్నాయి.
(హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో నిన్న, మొన్నటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించిన విషయం తెలిసిందే. సర్కారు పాఠశాలల విద్యార్థులకు రోజు విడిచి రోజు క్లాసులుండగా, ప్రైవేట్ విద్యాలయాలు రోజూ తరగతులు నిర్వహించాయి. మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే గంటపాటు విరామం ఇచ్చి, యథావిధిగా క్లాసులు చెప్పేవారు. దీంతో పొద్దస్తమానం పిల్లలకు బయట ఆడుకునే సమయం ఉండేదికాదు. అయితే వేసవి సెలవుల నేపథ్యంలో గత 20-30 రోజుల నుంచి పిల్లలు పుస్తకాలను పక్కన పెట్టి మళ్లీ ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. సెకండ్‌వేవ్ వచ్చిందని, వైరస్ వ్యాప్తి బాగా ఉందని, కాలక్షేపం కోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని తల్లిదండ్రులు చెబుతున్నా.. పిల్లలు ఆగట్లేదు. ఇరుగు, పొరుగిళ్లల్లో, కాలనీల్లో ఆడుకుంటూ వైరస్ వాహకులుగా మారుతున్నారు. అలాగే.. పిల్లలను సరుకుల కోసం బయటకు పంపిస్తుండడంతో వారు అనుకోకుండా కొవిడ్ బారిన పడుతున్నారని ఆరోగ్య కార్యకర్తల పరిశీలనలో తేలింది.
దడ పుట్టిస్తున్న కేసులు..
కరోనా మొదటి దశలో పిల్లలకు అంత ఇబ్బంది కనిపించలేదు. ఇంటిలో తల్లిదండ్రులకు వైరస్ సోకినా పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. రెండో దశలో మాత్రం.. నగరంలో కొంతమంది చిన్నారులు, బాలబాలికలు కొవిడ్ బారిన పడి, స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, సహజంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగానే కోలుకుంటున్నారు. కానీ, వారివల్ల ఇంట్లో పెద్దలకు సోకితే మాత్రం బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 11 శాతం మంది 5-20 ఏళ్లలోపువారివేనని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పిల్లలు, యువకులు వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా మొదటి దశలో మొత్తం కేసుల్లో 2,131 మంది చిన్నారులు కరోనా బారిన పడగా.. సెకండ్ వేవ్‌లో ఏప్రిల్ 1 నుంచి 15 వరకు 264 మంది పిల్లలు, 16వ తేదీ నుంచి 30 వరకు ఏకంగా 1053 మంది.. మే 1 నుంచి 15 లోపు 1618 మంది పిల్లలు కొవిడ్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. అటు మహారాష్ట్రలోనూ ఏప్రిల్‌లో పెద్దసంఖ్యలో పిల్లలు వైరస్ బారిన పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మూడో దశలో వైరస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పడం కష్టమని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
రెండు నెలలు జాగ్రత్త
పిల్లల్లో కరోనా కేసులు మొదటి దశ కంటే సెకండ్ వేవ్‌లో బాగా పెరుగుతున్నాయి. 15-20 ఏళ్ల వయసులోపు వారు కూడా అనవసరంగా బయటకు వెళ్తూ వైర్‌సను అంటించుకుంటున్నారు. పిల్లలకు కరోనా సోకినా లక్షణాలు బయటకు కనిపించవు. కానీ, వారి ద్వారా ఇంటిలోని వారికి వైరస్ సులువుగా అంటుకుంటోంది. వచ్చే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యుక్తవయసు పిల్లలు తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాలి.
డాక్టర్ రవికుమార్, సీనియర్ పీడియాట్రిక్ ప్రొఫెసర్, నిలోఫర్ ఆస్పత్రి
