దొరికిన దొంగ రేవంత్‌

ABN , First Publish Date - 2021-08-11T04:04:24+05:30 IST

దొరికిన దొంగ రేవంత్‌

దొరికిన దొంగ రేవంత్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినయ్‌భాస్కర్‌

ఇంద్రవెల్లి సాక్షిగా మాట్లాడినవన్నీ అవాస్తవాలే..

ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌


హన్మకొండ టౌన్‌, ఆగస్టు 10: ఇంద్రవెల్లి సాక్షిగా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడినవన్నీ అవాస్తవాలేనని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు. హన్మకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వినయ్‌భాస్కర్‌ రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. నాలుగు దశాబ్దాల కిందట భూమి, భు క్తి, ఆత్మగౌరవం కోసం సభ నిర్వహించిన ఇంద్రవెల్లి గిరిజనులను నా టి కాంగ్రెస్‌ ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. కానీ అదే పార్టీ సోమవారం సభ పెట్టి ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటన్నారు. 

ఈ సభలో రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గుమస్తా అయిన రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేసి డబ్బు సంపాదించారని, ఆ డబ్బుతోనే టీపీసీసీ అధ్యక్ష పదవిని పొందాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌ అని ధ్వజమెత్తారు. ఇంద్రవెల్లి సభకు 20వేల మందికి మించి హాజరు కాలేదని పేర్కొన్నారు. రేవంత్‌ నీచ రాజకీయాలు మానుకోవాలని   హెచ్చరించారు. గిరిజనలు, దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని వినయ్‌భాస్కర్‌ కొనియాడారు. 

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి మాజీ సీఎం, టీడీపీ నేత చంద్రబాబు ఏజెంట్‌గా కొనసాగుతూ, ఆయన ఎజెండాను తెలంగాణలో అమలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇంద్రవెల్లి గిరిజనులను బలిదీసుకున్న కాంగ్రెస్‌.. అదే ప్రాంతంలో సభ పెట్టి ప్రగల్భాలు పలకడం.. సంపినోడే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.  త్వరలోనే రేవంత్‌ బండారం బయటపెడతామని, ఆయన చిప్ప కూడు తినడం తప్పదని అన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ కనీసం డిపాజిట్‌ దక్కించుకోవాలని ఆయన సవాల్‌ విసిరారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశాడని సానుభూతి ఉంటుందన్నారు.  సామాన్య కార్యకర్తను పెట్టి ఈటలను ఓడిస్తామని స్పష్టం చేశారు.  సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, కార్పొరేటర్‌ బి.రంజిత్‌రావు, జనార్దన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T04:04:24+05:30 IST