కోర్కెలు తీర్చే చెన్నకేశవుడు

ABN , First Publish Date - 2021-03-25T05:19:29+05:30 IST

కోర్కెలు తీర్చే చెన్నకేశవుడు

కోర్కెలు తీర్చే చెన్నకేశవుడు
స్వామి వారి మూల విరాట్‌

రేపటి నుంచి చంద్రగిరి జాతర ప్రారంభం

స్వామిని దర్శించుకునేందుకు గుట్టపైకి రోడ్డు మార్గం

జాతరలో అన్ని సౌకర్యాల కల్పన

28న స్వామి వారి కల్యాణోత్సవందామెర : భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ చంద్రగిరి చెన్నకేశవస్వామి వెలుగొందుతున్నాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలోని శ్రీ చంద్రగిరి చెన్నకేశవస్వామి దేవాలయానికి(చంద్రగిరి పట్నం) వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ప్రతీ సంవత్సరం హోళీ పండుగ పురస్కరించుకుని ఘనంగా జాతర సాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే కాకుండా కరీంనగర్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. కోగిల్వాయిలో శ్రీ చంద్రగిరి చెన్నకేశవ స్వామి జాతర మహోత్సవాలు ఈ నెల 26న ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వామి వారు గుట్టపైకి చేరుకుంటాడు. 28న హోళీ పురస్కరించుకుని శీదేవి-భూదేవి సహిత చెన్నకేశవస్వామికి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతీ రోజూ నిత్య పూజాధికాలు, విశేష అలంకరణలు, నిత్య అభిషేకాలు, సహస్ర నామార్చనలు ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ సాగుతాయి. ఏప్రిల్‌ 9న గుట్టపై నుంచి ఊరేగింపుగా కోగిల్వాయిలోని దేవాలయానికి చేరుకుంటాడు. 

చంద్రగిరి గుట్టల్లో 12వ శతాబ్దంలో కాకతీయ రాజుల ఆధ్వర్యంలో పరిపాలన సాగినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. లేదళ్ల బెల్లాజీ, మాచర్ల వంశస్థులు(కర్ణాలు) పరిపాలన రాజ్యంగా ప్రతీతి. కాకతీయుల ద్వారా రాచర్ల రెడ్డి రాజులు పరిపాలన సాగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన చంద్రగిరి చెన్నకేశవస్వామి ఎంతో మహిమ గల వాడిగా పేరొందారు. భాగవత పురాణం ప్రకారం గజేంద్ర మోక్షం కథాంశం ఇక్కడే జరిగిందని వైదిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. చెన్నకేశవస్వామి దేవాలయం పరిధిలోని గుట్టపై ఏడు కోనేర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవుని గుండం(పెద్ద గుండం), చాకలి గుండం, జిల్లెల్ల గుండం, ముని గుండం, అవుసల వారి గుండం, కొత్తదేవుని గుండం, హరిజన వారి గుండం సహజ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతీ గుండానికి ఓ చారిత్రక నేపథ్యం ఉంది. చెన్నకేశవస్వామి దేవాలయానికి ఉప ఆలయాలుగా పురాతన శివాలయం, ఆంజనేయస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. ఈ నెల 26 నుంచి జాతర ప్రారంభమై ఏప్రిల్‌ 9 వరకు జరుగుతుంది. ఈ ఏడాది జాతరకు వచ్చే భక్తులకు గతంలో ఎన్నడూ లేని విధంగా తాగునీరు, గుట్టపైకి రోడ్డు మార్గం, విద్యుత్‌ సౌకర్యం వంటి సదుపాయాలను పూర్తి చేశారు.
Updated Date - 2021-03-25T05:19:29+05:30 IST