తహసీల్దార్లకు చెక్‌!

ABN , First Publish Date - 2021-11-09T07:03:58+05:30 IST

ధరణి రిజిస్ట్రేషన్‌ బాధ్యతల నుంచి తాహసీల్దార్లను తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

తహసీల్దార్లకు చెక్‌!

  • డీటీలకు ధర ణి రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు?
  • ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు 

హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ధరణి రిజిస్ట్రేషన్‌ బాధ్యతల నుంచి తాహసీల్దార్లను తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్ల (డీటీ)కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్లు మౌఖిక ఆదేశాలతో డీటీలతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. అలాగే రెగ్యులర్‌ తహసీల్దార్లు సెలవుల్లో, సస్పెన్షన్‌లో, దీర్ఘకాలిక సెలవులో ఉన్న కార్యాలయాల్లో ప్రస్తుతం డీటీలు ఽవ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అలాగే తహసీల్దార్లు భూసేకరణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో నిత్యం పాల్గొనాల్సి ఉంటున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో డీటీలు వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ ధరణిలో డీటీలకు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం లేదు. ప్రస్తుతం వారు రిజిస్ట్రేషన్ల సమయంలో తహసీల్దార్ల డిజిటల్‌ సంతకాన్ని వినియోగిస్తున్నారు.


 ఈ పరిస్థితుల్లో డీటీలు చేతివాటం ప్రదర్శించి చిన్న తప్పు చేసినా.. అది తహసీల్దార్ల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ధరణిలో రిజిస్ట్రేషన్ల బాధ్యతను పూర్తిగా డీటీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రెవెన్యూ అఽధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా డీటీలకు పలు అధికారాలు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. వీటికి సీఎం ఆమోదం తెలిపితే.. నేడో.. రేపో ప్రభుత్వం సర్క్యులర్‌ జారీచేసే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యూటేషన్‌ను కూడా ఆర్‌ఓఆర్‌-2020 ప్రకారం తహసీల్దార్లు మాత్రమే చేయాలి. డీటీలకు ఈ అధికారం కూడా కట్టబెడతారా లేక రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించి, మ్యూటేషన్‌ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ఈ ప్రతిపాదనలను మెజార్టీ తహసీల్దార్లు వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - 2021-11-09T07:03:58+05:30 IST