రాయలసీమకు చెక్‌

ABN , First Publish Date - 2021-06-22T07:30:55+05:30 IST

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణలోని కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటి గండం ఏర్పడటంతో వాటిని బతికించు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

రాయలసీమకు చెక్‌

  • గరిష్ఠంగా 55 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ.. 
  • కృష్ణపై తుంగభద్ర సంగమానికి ఎగువన
  • శ్రీశైలం నిండకపోతే జోగులాంబ నుంచి
  • పాలమూరు-రంగారెడ్డి ఆయకట్టుకునీరు
  • బ్యారేజీకి కేబినెట్‌ ఓకే.. త్వరలోనే సర్వే 


వనపర్తి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణలోని కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటి గండం ఏర్పడటంతో వాటిని బతికించు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా కృష్ణా, తుంగభద్ర నదుల సంగమానికి కాస్త ఎగువన వెల్‌టూర్‌ గ్రామం వద్ద బ్యారేజీని నిర్మించాలని తలపెట్టింది. ఇక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తారు. ఈ బైపాస్‌ ప్రాజెక్టు వల్ల కరవు కాలంలో కృష్ణా నదిపై ఎగువన నుంచి వచ్చే ప్రతీచుక్కను ఒడిసి పట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం కృష్ణానదిపై తెలంగాణకు సొంతంగా జూరాల ప్రాజెక్టు ఒక్కటే ఉంది. రెండేళ్లుగా సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో ఏటా వెయ్యి టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. జూరాల ఆధారంగా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ ఆయా పథకాల్లో ఇంకా పనులు పెండింగ్‌లో ఉన్నందున కేటాయించిన వరద జలాలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ మూడు ఎత్తిపోతల కింద మొత్తం 73 టీఎంసీల వరద నీటిని వినియోగించుకొనేందుకు డిజైన్‌ ఉన్నప్పటికీ ప్రస్తుతం 28 టీఎంసీలకు మించి ఉపయోగించుకోవడం లేదు. జూరాల నుంచి దూకే ప్రతీచుక్కా ప్రస్తుతం నేరుగా శ్రీశైలానికి వెళ్తుంది. 


శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ఆధారంగా కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ వాటికి రాయలసీమ  పథకంతో నీటిగండం ముప్పు ఏర్పడింది. శ్రీశైలం గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 892 అడుగులు కాగా 820 అడుగుల ఎత్తులో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల ఎత్తు నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున తీసుకునే విధంగా నిర్మిస్తోంది. అది పూర్తయితే పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద ఉన్న 16.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందదు. హైదరాబాద్‌కు తాగునీటి ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కృష్ణా నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరక ముందే 840 అడుగుల కాంటూర్‌ లెవల్‌లో 846 నుంచి 849 అడుగుల మధ్యన ఏదో ఒక ఎత్తులో గరిష్ఠంగా 55.3 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించవచ్చని అధికారులు ప్రతిపాదించారు. బ్యారేజీ నుంచి పైప్‌లైన్‌ ద్వారా పాలమూరు-రంగారెడ్డిలో కీలకమైన ఏదుల వీరాంజనేయ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు తరలించాలన్నది వ్యూహం. అక్కడి నుంచి పీఆర్‌ఎల్‌ఐ కింద ఉన్న మిగతా రిజర్వాయర్లకు నీరు వెళ్తుంది. కల్వకుర్తి పథకాన్ని కూడా ఏదుల రిజర్వాయర్‌కు అనుసంధానం చేయడం వల్ల పీఆర్‌ఎల్‌ఐ అయకట్టుకు ఎలాంటి ఢోకా ఉండదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. భీమా వరద కాలువపైనా దృష్టి 

అత్యంత కరవు ప్రాంతంగా ఉన్న నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్రణాళికలకు కూడా శనివారం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా భీమా నది తెలంగాణలో ప్రవేశించే కృష్ణ మండలం కుసుమర్తి వద్ద వరద కాలువ నిర్మించాలని ప్రతిపాదించింది.  తద్వారా నారాయణపేట జిల్లాలో ఇబ్బందులు ఏర్పడకుండా ఆయకట్టుకు నీరివ్వడానికి  ఉపయోగపడుతుందని సర్కార్‌ భావిస్తోంది. 


నీళ్లు లేనప్పుడే

రాయలసీమ లిఫ్ట్‌ పనులు పూర్తయితే ఎత్తిపోతల పథకాలకు 820 అడుగుల ఎత్తులో పాలమూరు-రంగారెడ్డికి 60 రోజులపాటు నీటి లభ్యత ఉండే అవకాశం లేదు. నీటి లభ్యత ఉన్నన్ని రోజులు పీఆర్‌ఎల్‌ఐని ఉపయోగించుకుంటారు. అక్కడ నీటి లభ్యత తగ్గిన తర్వాత వెల్‌టూరు బ్యారేజీ నుంచి ఎత్తిపోస్తారు. మొత్తం పీఆర్‌ఎల్‌ఐ రిజర్వాయర్ల సామర్థ్యం 67 టీఎంసీల పైచిలుకు ఉన్నది. ప్రతిపాదిత బ్యారేజీతో 60-70 టీఎంసీల నీటిని ఆ రిజర్వాయర్లకు ఎత్తిపోయొచ్చని అంచనా. అలాగే, 820 అడుగుల ఎత్తులో ఉన్న కల్వకుర్తి కింద 40టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం కోసం కల్వకుర్తి- పాలమూరు-రంగారెడ్డి అనుసంధానం ప్రతిపాదనలు న్నాయి. లభ్యత ఉన్నన్ని రోజులు గరిష్ఠంగా నీటిని తీసుకునేందుకు కల్వకుర్తి రిజర్వాయర్ల సామర్థ్యం పెంచనున్నా రు. ప్రస్తుతం కల్వకుర్తి కింద ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి కింద మొత్తం నీటినిల్వ సామర్థ్యం 4 టీఎంసీలే. మొత్తం 40 టీఎంసీలు వాడుకునేందుకు డిజైన్‌ ఉన్నా నిల్వ సామర్థ్యం లేదు. గతంలో కల్వకుర్తి ప్రధాన కాలువ, డిస్ర్టిబ్యూటరీల వెంట 46 చిన్న రిజర్వాయర్ల ఏర్పాటును ప్రతిపాదించారు. ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం పెంపు చర్చకు వచ్చినందున ప్రధాన జలాశయాల సామర్థ్యం పెంచుతారా లేక కాలువల వెంట రిజర్వాయర్ల ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా? అనే అంశం తేలాల్సి ఉంది. 


సరైన నిర్ణయం

బ్యారేజీ నిర్మాణంతో పాలమూరు-రంగారెడ్డితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న ఆయకట్టుకు సమృద్ధిగా నీరందించవచ్చు. రాయలసీమ లిఫ్టు పూర్తయితే మన పథకాలకు నీరు దొరకదు. ప్రభుత్వం తొందరగా బ్యారేజీ పనులు చేపట్టాలి. 

- మల్లయ్య, బ్యారేజీ సాధనసమితి అధ్యక్షుడు

Updated Date - 2021-06-22T07:30:55+05:30 IST