విదేశీ విద్య నిబంధనల మార్పు

ABN , First Publish Date - 2021-03-14T08:02:03+05:30 IST

విదేశీ విద్యకోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన నిబంధనలను మార్చాలని నిర్ణయించింది.

విదేశీ విద్య నిబంధనల మార్పు

హైదరాబాద్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): విదేశీ విద్యకోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎస్టీల కోసం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ నిధి, మైనార్టీల కోసం చీఫ్‌ మినిస్టర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ స్కీం, ఈబీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ స్కీం అమలుచేస్తోంది. ప్రతిభగల విద్యార్థులకు ఈ పథకంలో భాగంగా లక్షల రూపాయలు అందిస్తుండటంతో.. తక్కువ మార్కులు వచ్చినా.. మార్కులు పెంచుకుని నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివిధ సంక్షేమ శాఖలు విద్యార్థులు ఆన్‌లైన్లో సమర్పించిన సర్టిఫికెట్లను పరిశీలనకు జేఎన్‌టియుకు పంపగా.. అందులో దాదాపు 30 నకిలీవని తేలింది.  ఇలాంటివి పునరావృతం కాకుండా ఒరిజినల్‌ సర్టిఫికేట్ల పరిశీలనను అధికారులు తప్పనిసరి చేయనున్నారు.


కన్సల్టెంట్ల పాత్రపై అనుమానాలు.. 

నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి విదేశీ విద్య పథకానికి ఎంపికైనవారిపై ఎలాంటి చర్యను తీసుకోవాలన్న అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. వీరంతా ఇప్పటికే విదేశాల్లో ఉన్నందున కేటాయించిన స్కాలర్‌షి్‌పను రద్దుచేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ పథకంలో ఎంపికైనవారంతా పేద వర్గాలకు చెందినవారే ఉంటారు. స్కాలర్‌షిప్‌ కోసం కొన్ని కన్సల్టెన్సీలు సేవలు అందిస్తున్నాయి. వీటిని ప్రతిభ ఆధారంగా కేటాయించడంతో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియకుండానే సర్టిఫికెట్ల స్థానంలో నకిలీవి సమర్పిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపైనా సంక్షేమ శాఖల అధికారులు దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-03-14T08:02:03+05:30 IST