చదువుల్లో తడబాటు

ABN , First Publish Date - 2021-12-29T05:21:05+05:30 IST

చదువుల్లో తడబాటు

చదువుల్లో తడబాటు

పది, ఇంటర్‌ ఫలితాల్లో అంతా పాస్‌

జిల్లా కేంద్రమైనా ఏర్పాటు కానీ ఉన్నత విద్యా కళాశాలలు

పీడీలు లేక క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు

శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల, కళాశాలల భవనాలు

మానుకోటలో అధికారులంతా  ఇన్‌చార్జీలే..


మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, డిసెంబరు 28 : అభివృద్ధిలోనే కాదు చదువుల్లో కూడా మానుకోట జిల్లా వెనుకంజలో ఉందంటే అతిశయోక్తి కాదు.  జిల్లా కేంద్రంగా ఆవిష్కృతమైన మహబూబాబాద్‌లో ఉన్నత కళాశాలల ఏర్పాటు మాత్రం ఇక్కడి విద్యార్థులకు అందని ద్రాక్షగానే చేదు మిగులుస్తోంది. విద్యారంగానికి పెద్ద పీఠవేస్తున్నామన్న పాలకుల పలుకులు ప్రసంగాలకే పరిమితమవుతున్నాయే తప్ప ఆచరణకు నోచుకోవటం లేదు. నిరుపేద విద్యార్థులు అభ్యసించే సర్కారు బడులు, కళాశాలలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. మౌలిక వసతుల లేమి నడుమ విద్యార్థులు పాఠాలు నేర్చుకోవాల్సిన దైన్యస్థితి మానుకోట జిల్లాలో ఉంది. అత్యధికంగా వెనుకబడిన గిరిజనులు నివసిస్తున్న మానుకోట జిల్లాలో విద్యాభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. 


క్రీడలకు పుట్టిల్లు.. పీడీలు నిల్లు...

క్రీడలకు పుట్టినిళ్లుగా పేరొందిన మానుకోట జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పీఈటీలు, పీడీలు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినహా జిల్లాలో ఏ ఒక్క జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పీడీలు లేక పోవటం దురదృష్టకరం.  విద్యావ్యస్థను పర్యవేక్షించే డీఈవో, డీఐఈవో, ఎంఈవోలు అంతా ఇన్‌చార్జీలు గానే కొనసాగుతున్నారు. జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలోని ఆడిటోరియంలో నిర్వహిస్తుండటం గమనార్హం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్‌పై నుంచి పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థులు, ఆధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకుని చినుకు పడితే చాలు స్లాబ్‌ పై నుంచి నీరు తరగతి గదుల్లో పడుతున్నాయి. జిల్లాలో 2020-21 విద్యాసంవత్సరం కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆరు ఆపై తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన కొనసాగింది. దీంతో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థిని ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌ ఆగాఖాన్‌ అకాడమీలో సీరోలు ఏకలవ్య గురుకుల విద్యార్థి రౌతు దీక్షత, బయ్యారం ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థి బానోత్‌ నిహారికలు సీటు సాధించారు.


కాన రాని ఉన్నతవిద్యా కళాశాలల ఏర్పాటు..

మహబూబాబాద్‌ జిల్లాగా ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఉన్నత విద్యా కళాశాలల ఏర్పాటుకు మాత్రం మోక్షం లేదు. ఒక్క సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా బీ ఫార్మసీ కళాశాల ప్రారంభించి తరగతులు కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. ఏనాడో స్థాపించిన కళాశాలలే తప్ప నూతనంగా ఉన్నత విద్యాభాస్యం కోసం కళాశాలలు మాత్రం ఏర్పాటుకు నోచుకోవడం లేదు. మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 16 మండలాలు ఉంటే కేవలం నాలుగు డిగ్రీ కళాశాలలు, పది జూనియర్‌ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఇక మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో పీజీలో ఆర్ట్స్‌ గ్రూపులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇక టీటీసీ, బీఈడీ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఊసేలేదు. ఆయా విద్యనభ్యసించాలంటే ఈ ప్రాంత విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి విద్యనభ్యసించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక నిరుపేదల విద్యార్థులు చదువుకోలేక మానివేసిన సంఘటనలు కూడా కోకొల్లలు. పాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన మహబూబాబాద్‌ జిల్లాలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాగా, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలతో పాటు అనుబంధ నర్సింగ్‌ కళాశాల మంజూరయింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 


చివరాంకంలో ఉపాధ్యాయుల బదిలీలు...

విద్యాశాఖలో 2021 చివరాంకంలో ఉపాధ్యాయులు బదిలీలు కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 3503 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన వివిధ జిల్లాల నుంచి మానుకోట జిల్లాకు అన్ని కేటగిరిల ఉపాధ్యాయులు 901 మంది అలాట్‌ కాగా వారంతా వచ్చి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఈ జిల్లానుంచి 749 మంది వివిధ జిల్లాలకు బదిలీపై వెళ్లారు. జిల్లా విద్యాశాఖాధికారిగా గత కొద్ది సంవత్సరాలు పని చేసిన సోమశేఖర శర్మ భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీ కావడంతో ఆయన స్ధానంలో కొత్తగా పుుల్‌ అడిషనల్‌ ఇన్‌చార్జీ డీఈవోగా డాక్టర్‌ మహ్మద్‌ అబ్ధుల్‌హై విధుల్లో చేరారు.

Updated Date - 2021-12-29T05:21:05+05:30 IST