నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్‌కు.. రూ.1000 కేటాయింపు

ABN , First Publish Date - 2021-02-05T08:10:59+05:30 IST

కొత్త రైల్వే లైన ఊసే లేదు.. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు రైళ్ల ప్రస్తావన లేదు.. సర్వేలు పూర్తిచేసుకున్న ప్రాజెక్టులకూ మొండిచెయ్యే.. రైళ్ల పునరుద్ధరణపై ప్రకటనా లేదు....

నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్‌కు.. రూ.1000 కేటాయింపు

  • ఎంఎంటీఎస్‌ రెండో దశకు పది లక్షలే.. ఉసూరుమనిపించిన రైల్వే బడ్జెట్‌
  • ఊసే లేని కొత్త లైన్లు, అదనపు రైళ్లు
  • దక్షిణ మధ్య రైల్వేకు 7,222 కోట్లు
  • అందులో తెలంగాణకు 2,420 కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కొత్త రైల్వే లైన ఊసే లేదు.. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు రైళ్ల ప్రస్తావన లేదు.. సర్వేలు పూర్తిచేసుకున్న ప్రాజెక్టులకూ మొండిచెయ్యే.. రైళ్ల పునరుద్ధరణపై ప్రకటనా లేదు.. వెరసి కేంద్రం ప్రకటించిన 2021-22 రైల్వే బడ్జెట్‌ తెలుగు రాష్ట్రాలను నిరాశపరిచింది.  ఇంకా చెప్పాలంటే.. ఓ ప్రాజెక్టుకు వెయ్యి రూపాయలు.. మరో రెండు ప్రాజెక్టులకు రూ. 10 లక్షల చొప్పున విదిల్చారు. పేరుకే గత ఏడాది కంటే.. బడ్జెట్‌ కేటాయింపులు కొంత ఎక్కువగానే ఉన్నా.. ప్రయాణికుడి కోణంలో ఏమాత్రం ఆలోచించలేదు..! గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా తాజా కేంద్ర బడ్జెట్‌లో అంతర్భాగమైన రైల్వే బడ్జెట్‌ కేటాయింపులను గురించి వివరించారు. ఈ సారి దక్షిణ మధ్య రైల్వేకు రూ. 7,222 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సారి కేటాయింపులు రూ. 198 కోట్లు ఎక్కువ. మొత్తం బడ్జెట్‌లో తెలంగాణలోని ప్రాజెక్టులకు కేటాయించింది రూ. 2,420 కోట్లు. సరుకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు కేంద్రం ప్రతిపాదించిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లలో రెండు దక్షిణ మధ్య రైల్వేకు దక్కాయి. వాటిల్లో ఒకటి నార్త్‌-సౌత్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌.  రెండోది ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌. ఇది పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌, విశాఖపట్నం మీదుగా విజయవాడ వరకు ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్రానికి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఇస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చింది. వరంగల్‌ జిల్లా కాజీపేటలో దీనిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో తెలంగాణ సర్కారు రూ. 380 కోట్ల విలువైన 150.5 ఎకరాల స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించింది. ఆ తర్వాత కేంద్రం మాటమార్చింది. కోచ్‌ ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించి.. ఇక్కడ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపును ఏర్పాటు చేస్తామని చెప్పింది. దీనికి కూడా రూ. 2కోట్లు మినహా.. సరిపడా నిధులను కేటాయించలేదు. కాజీపేటలో డివిజన్‌ను ఏర్పాటు చేస్తామనే హామీని.. ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. హైదరాబాద్‌లో రైల్వే ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు శివార్లలోని చర్లపల్లి, నాగులపల్లిలో రెండు టర్మినళ్లను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో మాత్రం చర్లపల్లి టర్మినల్‌కు రూ.50 కోట్లు కేటాయించారు.  ఫీజిబిలిటీ లేదని పేర్కొం టూ.. నాగులపల్లి టర్మినల్‌ను ఉపసంహరించుకున్నారు. ఆదిలాబాద్‌లో టర్మినల్‌ ఏర్పాటు ఆలోచన ఉందనే ప్రకటన చేశారు. హైదరాబాద్‌ ఎంఎంటీఎ్‌సలో ఏసీ బోగీలను ప్రవేశపెట్టడం, రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచడం వంటి ప్రతిపాదనలూ  మరుగునపడిపోయాయి.




ఈ కొత్త లైన్లకు కేటాయింపుల్లేవ్‌

నాగులపల్లి నుంచి సంగారెడ్డి మీదుగా మెదక్‌కు 89.10 కిలోమీటర్ల కొత్త రైల్‌ ప్రతిపాదనకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆదిలాబాద్‌-నిర్మల్‌-ఆర్మూర్‌ (317 కిలోమీటర్లు) లైన్‌ పరిస్థితి అలాగే ఉంది. హుజూరాబాద్‌-ఎల్కతుర్తి-కరీంనగర్‌ (120 కిలోమీటర్ల) కొత్తలైన్‌ సర్వేకు నిధుల కేటాయింపులు లేవు. 2013-14లో 200 కిలోమీటర్ల మేర మంజూరైన మణుగూరు-రామగుండం కొత్త లైన్‌కు అప్పట్లో రూ. 1,112 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికీ ప్రాజెక్టు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. మాచర్ల-నల్లగొండ కొత్త రైల్వే లైన్‌కు మరీ దారుణంగా రూ. 1,000 కేటాయించారు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు రూ. 10 లక్షల మేర కేటాయింపులు జరిగాయి.


ప్రయాణికుల సదుపాయాలకు 173 కోట్లు

తాజా కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల సదుపాయాల కోసం రూ. 173 కోట్లు కేటాయించారు. డబ్లింగ్‌, థర్డ్‌లైన్‌, బైపాస్‌ లైన్‌ పనుల కోంం రూ. 4,238 కోట్లు, కొత్తలైన్లు/మూలధనం/డిపాజిట్లకు రూ. 2,195కోట్లు, విద్యుదీకరణకు రూ. 617 కోట్లు, ఆర్వోబీలు, లెవల్‌ క్రాసింగ్‌కు రూ. 672 కోట్లు, స్వర్ణ చతుర్భుజి బ్రిడ్జిలకు రూ. 374 కోట్లు, రైలు ప్రమాదాల నిరోధక వ్యవస్థ (టీసీఏఎస్‌) కోసం రూ. 60 కోట్లు కేటాయించారు.తెలంగాణలో పలు ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకు నిధులను కేటాయించారు. వాటిల్లో మనోహరాబాద్‌-కొత్తపల్లి లైన్‌కు రూ.325 కోట్లు, భద్రాచలం రోడ్డు-సత్తుపల్లికి రూ. 267కోట్లు, మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌కు రూ.149కోట్లు, అక్కన్నపేట్‌-మెదక్‌కు రూ. 83.6కోట్లు, కాజీపేట-బల్లార్ష మూడో లైన్‌కు రూ.475కోట్లు, కాజీపేట-విజయవాడ-రేణిగుంట బైపా్‌సకు రూ. 426కోట్లు, కాజీపేట-విజయవాడ 3వ లైన్‌కు రూ.333కోట్లు, సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌కు రూ.100కోట్లు, అకోల-డోన్‌ డబ్లింగ్‌కు రూ.5 కోట్లు ఉన్నాయి.


రాష్ట్ర వాటా నిధులు రావడం లేదు

ఎంఎంటీఎస్‌ రెండో దశ వంటి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు రావడం లేదు. దీంతో కొన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదు. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు 118ు ఎక్కువ నిధులు వచ్చాయి. జోన్‌ నుంచి రైళ్ల పెంపు లేదు. కొవిడ్‌-19 కారణంగా నిలిపివేసిన రైళ్లను ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది. జోన్‌లో మొత్తం 193 రైళ్లకు 123 మాత్రమే పునరుద్ధరణ అయ్యాయి.  పది రోజుల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపడంపై నిర్ణయం తీసుకుంటాం. లాక్‌డౌన్‌ సమయంలో 244 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌ లైన్ల పనులను పూర్తిచేశాం. 

- గజానన్‌ మాల్య, దక్షిణ మధ్య రైల్వే జీఎం

Updated Date - 2021-02-05T08:10:59+05:30 IST