కాంగ్రెస్‌తో మిలాఖాత్ అయ్యారన్న హరీశ్ ఆరోపణలపై కిషన్‌రెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2021-11-03T00:32:30+05:30 IST

హుజూరాబాద్ విజయం ప్రజల విజయం అని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చాలా రకాలుగా మభ్యపెట్టినా..

కాంగ్రెస్‌తో మిలాఖాత్ అయ్యారన్న హరీశ్ ఆరోపణలపై కిషన్‌రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ: హుజూరాబాద్ విజయం ప్రజల విజయం అని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చాలా రకాలుగా మభ్యపెట్టినా ప్రజలు మరో చరిత్ర లిఖించారని ఆయన వ్యాఖ్యానించారు. నైతిక విలువలకు, నీతికి, నిజాయితీకి మద్దతుగా ప్రజలు నిలబడ్డారన్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. 


‘‘ప్రజలను అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా 60 శాతం మహిళలు బీజేపీకి అండగా నిలబడ్డారు. ఐదు నెలల్లో హుజూరాబాద్‌లో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, పెండింగ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వేలాది కోట్లతో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టినా అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు లొంగలేదు. తెలంగాణలో ధన రాజకీయాలకు హుజూరాబాద్ ప్రజలు చరమగీతం పాడారు. డబ్బుకంటే మంచిపాలన ముఖ్యమని ప్రజలు నిరూపించారు.’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. 


హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని కిషన్ రెడ్డి అన్నారు. అహంకారానికి, అధర్మానికి ప్రజలు చరమగీతం పాడారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు గమనించారు . ప్రజల విశ్వాసం ముందు ధనం వృధా అని హుజూరాబాద్ ఎన్నికలు నిరూపించాయి. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలను ముందు నుండి అప్రమత్తం చేసాం. నోట్ల కట్టల కంటే నైతిక విలువలు ముఖ్యమని ప్రజలు నిరూపించారు. అబద్ధాల, సమాధుల పాలన చేస్తూ టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. హుజూరాబాద్ ప్రజలకు బీజేపీ రుణపడి ఉంటుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక విజయావకాశాలపై ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఉండి ఆరా తీశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి టీఆర్ఎస్ చేయని ప్రయత్నం, చెప్పని అబద్ధం లేదు. అలాంటిది కేటీఆర్ ట్వీట్ చేయడం సరికాదు. బీజేపీ, కాంగ్రెస్ కలసి పని చేశాయని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యనించడం హాస్యాస్పదం. ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులను తన పార్టీలో చేర్చుకుంది. ఈటల పట్ల టీఆర్ఎస్ చాలా అవమానకరంగా ప్రవర్తించింది. ఆయనపై కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురిచేసింది.’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-03T00:32:30+05:30 IST