పార‌ద‌ర్శ‌‘కత’ కంచికేనట!

ABN , First Publish Date - 2021-05-30T06:14:31+05:30 IST

సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద సీసీఐతో పాటు మార్కెటింగ్‌ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. సీసీ కెమెరాల కళ్లకు గంతలు కడుతుంటే ఈ శాఖ ఏం చేసిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది, అధికారులు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలతో పాటు రైతులు తెచ్చిన పంటను పరిశీలించాల్సి ఉంటుంది. రైతు తెచ్చింది అతని పంటనేనా.. కాదా? అని నిర్ధారించి సీసీఐ అధికారులకు తెలియజేస్తారు. అనంతరం రైతులు విక్రయించిన పత్తి పంటకు సంబంధించిన డబ్బును బ్యాంకులో జమ చేయడం వరకు ప్రక్రియలన్నీ మార్కెటింగ్‌ శాఖ ద్వారానే జరుగుతాయి.

పార‌ద‌ర్శ‌‘కత’ కంచికేనట!

 సీసీఐ కొనుగోళ్ల దందా విచారణపై జోరుగా పైరవీలు

 సిబ్బంది నుంచే రికవరీ చేయాలని నేతల ఒత్తిళ్లు

 అధికారులు, యజమానుల జోలికి వెళ్లొద్దంటూ పోలీసులకు వార్నింగ్‌

 ‘కాటన్‌’ అవకతవకల్లో మార్కెటింగ్‌  శాఖ ప్రమేయం!

 రైతుల నుంచి తక్కువకు కొనుగోలు.. ఎక్కువ ధరకు విక్రయాలు

 ఒక్కొక్కటిగా వెలుగులోకి  వస్తున్న అక్రమాలు

 పోలీసు విచారణను నీరుగార్చేందుకు ప్రయత్నాలు

 (ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

సీసీఐ కొనుగోళ్ల అక్రమాల్లో మరికొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా రైతులను తీవ్రంగా నష్టపరిచేలా ట్రేడర్స్‌, బినామీలు, యాజమానులు కుమ్ముక్కైనట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా క్వింటాల్‌ రూ.5,400 చొప్పున పత్తిని గత ఏడాది కొనుగోలు చేసింది. అయితే గ్రామాల్లో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ట్రేడర్స్‌ పేరుతో కొన్ని చోట్లా.. లూజు పత్తి కొనుగోలు పేరుతో మరికొన్ని చోట్లా సేకరించినట్టు సమాచారం. క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ.5 వేల మధ్య రైతులకు చెల్లించి సీసీఐకి మాత్రం మద్దతు ధరకు అమ్మకాలు చేసినట్లు తెలిసింది. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద బినామీ రైతు పేర్లతో పత్తిని విక్రయించి సొమ్ము చేసుకొనే వారని సమాచారం. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు మార్కెట్‌లో అమ్ముకుంటూ దందా సాగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు, సీసీఐ అధికారులకు తెలిసే జరిగిందని రైతు లు అంటున్నారు. రెండేళ్లలో కోట్లాది రూపాయల రైతుల సొమ్మును అక్రమంగా కొల్లగొట్టారని ప్రచారం జరుగుతోంది. 

‘మార్కెటింగ్‌’ మాయ.. 

సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద సీసీఐతో పాటు మార్కెటింగ్‌ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. సీసీ కెమెరాల కళ్లకు గంతలు కడుతుంటే ఈ శాఖ ఏం చేసిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది, అధికారులు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలతో పాటు రైతులు తెచ్చిన పంటను పరిశీలించాల్సి ఉంటుంది. రైతు తెచ్చింది అతని పంటనేనా.. కాదా? అని నిర్ధారించి సీసీఐ అధికారులకు తెలియజేస్తారు. అనంతరం రైతులు విక్రయించిన పత్తి పంటకు సంబంధించిన డబ్బును బ్యాంకులో జమ చేయడం వరకు ప్రక్రియలన్నీ మార్కెటింగ్‌ శాఖ ద్వారానే జరుగుతాయి.  

ఇంత కీలకంగా ఉన్న ఆ శాఖ అధికారులు సీసీఐ కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతుంటే కళ్లు మూసుకొని కూర్చున్నారా..? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది చిట్యా ల సీసీఐ కొనుగోల కేంద్రం వద్ద ట్రేడర్స్‌ పత్తిని రైతుల పేరు తో విక్రయిస్తుంటే ఓ ఉద్యోగి అడ్డుకున్నట్లు సమాచారం. దీం తో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ‘రైతులే తక్కువ ధర కు అమ్ముకుంటున్నారు.. వాళ్ల నుంచి సీసీఐకి ట్రేడర్స్‌ విక్రయిస్తున్నారు. మధ్యలో మనకెందుకు?.. చూసీచూడనట్టు వదిలేయ్‌’ అని ఆదేశించారట. అప్పటి నుంచి సీసీఐ కొనుగో లు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాల్లో మార్కెటింగ్‌ శాఖకు మామూళ్లు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజమైన రైతు అమ్మే పత్తి బస్తాకు రూ.19 వసూలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. అదే ట్రేడర్స్‌, నకిలీలు విక్రయించే పత్తి కి బస్తాకు రూ.100 వరకు వసూలు చేస్తున్నారని సమాచా రం. రోజుకు వేల సంఖ్యలో పత్తి బస్తాలు విక్రయాలు జరుగుతాయి. భూపాలపల్లి జిల్లాలో అంతా బినామీల పేరుతో జరిగిన దందా కావటంతో భారీ మొత్తంలో మామూళ్ల రూపంలో ఆ శాఖకు చేరినట్టు ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా రూ.50 లక్షలకు పైగా ముడుపుల రూపంలో ఆ శాఖ ఖాతాలోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కొనుగోళ్లలో కీలకంగా ఉన్న సీసీఐకి మాత్రం క్వింటాల్‌కు రూ.500 వరకు ముట్టజెప్పాల్సిందేననే తెలుస్తోంది.  ఈ మొ త్తం కూడా రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనట. తేమ పేరుతోనో.. తూకంలో మోసం చేయటం లేదా నాసిరకం పత్తి పేరుతో తక్కువ ధర చెల్లించటమో చేసి రైతుల కడుపు కొట్టి వీళ్లకు పెట్టాల్సి వస్తుందననే ప్రచారం జరుగుతోంది.  

విచారణను నీరుగార్చే ప్రయత్నం!

 సీసీఐ కొనుగోళ్ల అక్రమాల్లో వాస్తవాలు బయటకు వస్తుంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. తమను తాము కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఎస్‌ రూపేష్‌ కుమార్‌ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు. సిబ్బంది నుంచి పలు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. అంతేకాకుండా సిబ్బంది 1,500 క్వింటాళ్ల వరకు అక్రమాలకు పాల్పడినట్లు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డబ్బులతో వారి కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలను, ఇతర సామగ్రిని ఇప్పటికే పోలీసులు రికవరీ చేసినట్టు తెలిసింది. మరింత దూకుడుగా వెళ్తున్న పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిబ్బంది నుంచి రికవరీ చేసి కేసులను మూసేయాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీఐ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్‌ శాఖ అధికారుల జోలికి వెళ్లొద్దని, కనీసం వారిని విచారించొద్దని పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ దందాలో పోలీసుల పాత్రపై ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ విచారణ చేపట్టినట్టు తెలిసింది. శనివారం ఆయన భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. త్వరలోనే ఐజీ నాగిరెడ్డి కూడా పర్యటించి కూపీ లాగనున్నట్టు తెలిసింది.

Updated Date - 2021-05-30T06:14:31+05:30 IST