కలెక్టర్లకు నిధుల కటకట

ABN , First Publish Date - 2021-02-09T04:14:56+05:30 IST

కలెక్టర్లకు నిధుల కటకట

కలెక్టర్లకు నిధుల కటకట

ఏటా తగ్గుతున్న సీబీఎఫ్‌ నిధులు 

2020-21 సంవత్సరంలో మొండి చేయి

అత్యవసర పనులకు నిధుల కొరత


హన్మకొండ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో ఎప్పుడు సమావేశం పెట్టినా జిల్లాల ప్రగతికి వారే మూలస్తంభాలని చెబుతారు.  ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు నిధుల కొరత రాకుండా కలెక్టర్లకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ముఖ్యమైన పనులకు ఆ నిధులను వాడుకునే విచక్షణను వారికే వదిలేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఇంతకు ఆ నిధులేవి ? ప్రభుత్వం ప్రకటించినట్టు కలెక్టర్ల చేతిలో చాలినన్ని నిధులు ఇప్పుడు లేవు. వారు డబ్బులకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులకు ఇవ్వాలంటే వారిచేతుల్లో డబ్బులుండడం లేదు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 


అత్యవసర పనులకు ఇక్కట్లు

కలెక్టర్లు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు వారి దృష్టికి వస్తాయి. క్రూషియల్‌ బ్యాలెన్స్‌ ఫండ్‌ (సీబీఎఫ్‌) కింద అందుబాటులో ఉన్న నిధుల నుంచి మంజూరు చేయడం ఆనవాయితీ. కానీ గత మూడేళ్లుగా కలెక్టర్లకు ప్రత్యేక నిధులు చాలినన్ని మంజూరు కావడం లేదు. ఈ ప్రత్యేక నిధుల్లో ప్రభుత్వం ఏటా కోతలు విధిస్తోంది. 2017 వరకు ఒక్కో జిల్లాకు ఏటా రూ.2కోట్లు మాత్రమే విడుదల చేసేవారు. 2018 నుంచి ఈ నిధులను రూ.5కోట్లకు పెంచారు. ఇక నిధులు ఫుష్కలంగా అందుబాటులో ఉంటాయని ఆశించి కలెక్టర్లకు నిరాశే ఎదురైంది. సీబీఎఫ్‌ నిధులను ప్రభుత్వం పెంచినట్టే పెంచి అదేస్థాయిలో తగ్గించుకుంటూ వస్తోంది. కరోనా పుణ్యమా అని ఈ ఏడాది నిధుల కేటాయింపును పూర్తిగా నిలిపివేసింది. దీంతో కలెక్టర్లు అత్యవసర పనుల విషయంలో ఏం చేయలేకపోతున్నారు. ఫైళ్లపై సంతకాలకే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది.


కరోనా పుణ్యమా అని...

జిల్లా కలెక్టర్లకు ఏటా కేటాయిస్తున్న ప్రత్యేక నిధులను ఈ ఏడాది కరోనా పేరుతో పూర్తిగా నిలిపివేశారు. ఏమైనా అత్యవసర పనులు చేపట్టాలంటే ప్రతీసారి ప్రభుత్వానికి నివేదించాల్సి వస్తోంది. సాధారణంగా ప్రత్యేక నిధులతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఖర్చు చేస్తుంటారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రముఖుల పర్యటనలు, జాతరల సమయాల్లో ఈ నిధులను వినియోగిస్తారు. 


ఈ ఏడాది నిధులేవి?

ఉమ్మడి జిల్లా పరిధిలో వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు  2017-18 రూ.5కోట్ల చొప్పున విడుదలయ్యాయి. కొత్త జిల్లాల ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఈ మేరకు పెంచింది. ప్రతీ ఏటా ఇంతే నిధులు వస్తాయని ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా 2018-19లో ఈ నిధులు సగానికి సగం తగ్గాయి. ఈ సంవత్సరం రూ.2.75 కోట్ల చొప్పున మంజూరయ్యాయి.  2019-20 సంవత్సరంలో రూ.1.30కోట్లే వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్క పైసా కూడా రాలేదు.

Updated Date - 2021-02-09T04:14:56+05:30 IST