ఈవెంట్‌ పేరిట అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులే!

ABN , First Publish Date - 2021-12-30T07:08:32+05:30 IST

కొత్త సంవత్సర వేడుకల్లో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌ నగర

ఈవెంట్‌ పేరిట అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులే!

  • మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలే.. కొత్త సంవత్సర వేడుకల్లో జర పైలం!
  • రేపు అర్ధరాత్రి 1 గంట వరకు వేడుకలకు అనుమతి.. వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
  • మార్గదర్శకాలు జారీ చేసిన పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సర వేడుకల్లో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈవెంట్ల పేరిట అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ మేరకు 3స్టార్‌, ఆపై స్థాయి హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌లకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు. 31న అర్ధరాత్రి ఒంటిగంట వరకు వేడుకలకు అనుమతి ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు పోలీస్‌ కమిషనర్‌ నుంచి ముందస్తు అనుమతి (48 గంటల ముందే) తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే మార్గదర్శకాలు అమలు చేయాలని సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు కూడా ప్రకటించారు. ఒమైక్రాన్‌ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. నిర్వాహకులకు మార్గదర్శకాలు..

కార్యక్రమం జరిగేచోట భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. 

మాస్కు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించరాదు. మాస్కు లేకుంటే రూ.వెయ్యి జరిమానా.

వ్యాక్సినేషన్‌ రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. 

ద్వారాల వద్ద శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలి. 

నిబంధనల అమలుపై ఎప్పటికప్పుడు స్పీకర్లలో ప్రకటించాలి. 

నిర్వాహకులు, వారి సిబ్బంది కనీసం 48గంటల ముందు కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకుని.. నెగెటివ్‌ అని నిర్ధారణ అయి ఉండాలి. 

బయట జరిగే కార్యక్రమాల్లో డీజేకు అనుమతి లేదు. ఇరుగు పొరుగు నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు. 

అశ్లీలనృత్యాలు, అసభ్య వస్త్రధారణ లాంటివి అనుమతించరాదు.

మాదకద్రవ్యాల వినియోగం, వాటిని అరికట్టడంలో విఫలమైతే నిర్వాహకులే బాధ్యత వహించాలి. 

పబ్లిక్‌ స్థలాల్లో మద్యం తాగడం, అసభ్య ప్రవర్తన, జూదం లాంటివి నిషేధం.

ఈవెంట్‌ జరిగే ప్రాంతమంతా సీసీ కెమెరాలు ఉండాలి. 

ఏదైనా నష్టం, అల్లరి జరిగితే యాజమాన్యానిదే బాధ్యత.

తగాదాలకు దారి తీసే చర్యలు, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలకూ పాల్పడరాదు. 

ట్రాఫిక్‌ నిబంధనలు

ఈవెంట్‌కు వచ్చే వాహనాల కోసం పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులదే. రోడ్లపై వాహనాలు పార్క్‌ చేస్తే చర్యలు తప్పవు.

సెక్యూరిటీ సిబ్బందిని సిద్ధంగా ఉంచుకొని పార్కింగ్‌, భద్రతా విషయాల్లో వారికి శిక్షణ ఇచ్చే బాధ్యత నిర్వాహకులదే.

మద్యం మత్తులో ఉన్నవారిని ఇంటి వద్ద డ్రాప్‌ చేయడానికి డ్రైవర్లు, క్యాబ్‌లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులదే. 

తాగి వాహనాలు డ్రైవింగ్‌ చేస్తే పోలీసులు తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయి. కేసు నమోదు చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా విఽధిస్తామని సీపీ హెచ్చరించారు. 


Updated Date - 2021-12-30T07:08:32+05:30 IST