కాసుల కన్వర్షన్‌

ABN , First Publish Date - 2021-02-06T06:28:05+05:30 IST

ఆ ప్రాంతంలో ఓపెన్‌కాస్టు కోసం సింగరేణి భూ ములు సేకరించింది. అందులో ఒక వ్యాపారి భూమి కూడా ఉంది. స్థలాన్ని సింగరేణికి ఇచ్చేశాక ఆ వ్యాపారి మదిలో ఒక కుటిల ఆలోచన మెదిలింది.

కాసుల కన్వర్షన్‌

  • సింగరేణి సేకరించిన భూమికి నాలా కన్వర్షన్‌ ఇచ్చిన ఆర్డీవో
  •  గోదావరి జలాల్లో ఉన్న స్థలాలకు.. 
  • ఓసీ పరిహారం ఇప్పించిన తహసీల్దార్‌
  • చేతులు మారిన కోట్లాది రూపాయలు
  • ఎంఆర్‌వో సస్పెన్షన్‌.. సెలవుపై  ఆర్డీవో


మంచిర్యాల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆ ప్రాంతంలో ఓపెన్‌కాస్టు కోసం సింగరేణి భూ ములు సేకరించింది. అందులో ఒక వ్యాపారి భూమి కూడా ఉంది. స్థలాన్ని సింగరేణికి ఇచ్చేశాక ఆ వ్యాపారి మదిలో ఒక కుటిల ఆలోచన మెదిలింది. ఆయనకు అధికారులు సహకరించారు. ఇంకేముంది.. కోట్ల రూపాయల పరిహారం వారి చేతుల్లోకి వచ్చేసింది. అయితే నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం డబ్బులు తక్కువగా ఉండటం తో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. తీగ లాగడంతో విషయం బయటపడింది.

మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారంలో ఐకే 1, 1-ఏ గనులను ఓసీపీగా మార్చేందుకు 640.10 ఎకరాలను సేకరించారు. ఇందుకు సంబంధించి నిర్వాసితులకు చెల్లించాల్సిన సొమ్మును కూడా సింగరేణి అధికారులు ప్రభుత్వానికి అప్పగించారు. అయితే సిం గరేణి తీసుకున్న భూముల్లో 4.32 ఎకరాలను వ్యవసాయేతర భూములుగా మార్చడం వివాదాస్పదమైంది. ఓసీపీ కోసం సేకరిస్తున్న భూముల్లో పెద్ద మొత్తంలో నష్టపరిహారం పొందేందుకు ఓ వ్యాపారి పన్నాగం ప న్నాడు. ఇందారం శివారు సర్వే నంబర్‌ 406లో 4.32 ఎకరాలను వ్యవసాయేతర భూములుగా మార్చాలని(నాలా కన్వర్షన్‌) ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అంతకుముందే ఆ భూములను ఓసీపీకి కేటాయించారు. 2017 మే నెలలలో ఆ 4.32 ఎకరాలను వ్య వసాయేతర భూములుగా మారుస్తూ ఆర్డీవో ప్రొసీడిం గ్‌ ఇచ్చారు. ఓసీపీ కోసం భూమి కేటాయించిన అధికారే తిరిగి నాలా కన్వర్షన్‌ ఇవ్వడం చట్ట విరుద్ధమని సింగరేణి అధికారులు కలెక్టర్‌తోపాటు ఆర్డీవోకు ఫిర్యా దు చేశారు. నాలా కన్వర్షన్‌ను రద్దు చేయాలని కోరారు. 


మూడింతలు పరిహారం..

ఓసీపీ కోసం సేకరించిన భూములకు ఎకరానికి రూ.24.60 లక్షలుగా నిర్ణయించి 640.10 ఎకరాలకు స రిపడా మొత్తాన్ని సింగరేణి అధికారులు ఆర్డీవో అకౌంట్‌లో జమ చేశారు. అయితే వివాదాస్పద 4.32 ఎకరాలకు సింగరేణి కేటాయించిన దానికన్నా మూడింతలు పరిహారం చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ మొ త్తంలో ముడుపులు చేతులు మారాయి. ఆర్డీవో శ్రీనివాస్‌ వ్యవహార శైలిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు.  ఆయన స్థానంలో వచ్చిన ఆర్డీవో రమేశ్‌ విచారణలో అక్రమాలు వెలుగు చూడటంతో సింగరేణి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పరిహారం చెల్లింపులు నిలిపివేయాలని కలెక్టర్‌కు విన్నవించారు.


మరో చోట కూడా నొక్కేశారు..

ఓసీపీ కోసం సేకరించిన భూములకు సంబంధించి మరో వివాదం కూడా ఉంది. గోదావరి జలాల్లో కలిసిపోయిన కొన్ని భూములు ఓసీపీ కింద పోతున్నాయని పేర్కొంటూ జైపూర్‌ తహసీల్దార్‌ ఇదే వ్యాపారికి మేలు చేకూర్చే విధంగా రికార్డు తయారు చేశారు. నదిలో కలిసిపోయిన 11 ఎకరాలకు.. ఒక్కో ఎకరానికి రూ.14 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు ఆర్డీవో రమేశ్‌ విచారణలో వెల్లడైంది. ఈమేరకు ఆర్డీవో.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో గత డిసెంబరులో జైపూర్‌ తహసీల్దార్‌ ప్రసాద్‌వర్మ, డిప్యూటీ తహసీల్దార్‌ పోచయ్యనుసస్పెండ్‌ చేశారు. కాగా, అధికంగా చెల్లించిన పరిహారం రికవరీ చేయాలని, నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఒత్తిడి రావడం, గత అధికారుల తప్పిదానికి తాను జవాబు చెప్పాల్సిన పరిస్థితుల్లో  రమేశ్‌ కూడా సెలవుపై వెళ్లారు.

Updated Date - 2021-02-06T06:28:05+05:30 IST