కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-03-23T05:06:18+05:30 IST

కరోనా కలకలం

కరోనా కలకలం

ఇద్దరు ఉపాధ్యాయులు, ట్రైనీ టీచర్‌కు పాజిటివ్‌

ఆందోళనలో కంకరబోడ్‌ హైస్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులు 

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, మార్చి 22 : మహబూబాబాద్‌ పట్టణంలోని కంకరబోడ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, ట్రైనీ టీచర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయిన విషయాన్ని హెచ్‌ఎం వెంకటేశ్వరరావు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సదరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండా ఇంటివద్దనే చికిత్స పొందే విధంగా అఽధికారులు సూచించారు. వైద్యుల సలహా, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మరో ట్రైనీ ఉపాధ్యాయురాలుకి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి హోం క్వారంటైన్‌లో చికిత్సపొందుతున్న విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 19 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు బోధనేతర సిబ్బంది, మరో 10 మంది ట్రైనీ ఉపాధ్యాయులు వెరసి 32 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు 250 మంది విద్యార్థులున్నారు. తొలుత 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్షబోధన ప్రారంభం కాగా, ఫిబ్రవరి 24 నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠశాలకు వచ్చే విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల అంగీకార పత్రాలను తీసుకొని తరగతులు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు రావాలని విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులకు గాను 170 మంది విద్యార్థులు తల్లిదండ్రుల అంగీకార పత్రాలతో పాఠశాలకు హాజరవుతున్నారు. కాగా, పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, మరో ట్రైనీ ఉపాధ్యాయినీకి కూడా పాజిటివ్‌ రావడంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రావును వివరణ కోరగా ఇద్దరు ఉపాధ్యాయులు, మరో ట్రైనీ టీచర్‌కు 15 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వెంటనే సదరు ఉపాధ్యాయులను హోం క్వారంటైన్‌లో ఉంచామని, ఈవిషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించామని తెలిపారు. పాఠశాలలో శానిటైజింగ్‌ చేస్తూ, విద్యార్థులు మాస్క్‌లు, భౌతికదూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని చెప్పారు. కాగా, ఇప్పటికైనా పాఠశాలలోని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Updated Date - 2021-03-23T05:06:18+05:30 IST