వ్యవసాయం పరిశ్రమగా పురోగమించాలి:కేబినెట్ సబ్ కమిటీ

ABN , First Publish Date - 2021-08-10T23:05:18+05:30 IST

తెలంగాణలో వ్యవసాయం పరిశ్రమగా పురోగమించాలని వ్యవసాయంపై ఏర్పాటయిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది.

వ్యవసాయం పరిశ్రమగా పురోగమించాలి:కేబినెట్ సబ్ కమిటీ

హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయం పరిశ్రమగా పురోగమించాలని వ్యవసాయంపై ఏర్పాటయిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యవసాయరంగంపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వీసీలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి,  ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాముము తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వ్యవసాయరంగం బలోపేతమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యమని కమిటీ అభిప్రాయపడింది.ముఖ్యమంత్రి కేసీఅర్ కి అత్యంత ఇష్టమైనది వ్యవసాయ రంగం. తెలంగాణలో 35 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్నామని పేర్కొంది. తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమేనని కమిటీ పేర్కొంది. రాబోయే తరాలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వైపు నడిపించాలి.ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే వ్యవసాయరంగం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు.వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలని ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్ది అభిప్రాయపడ్డారు.


యాసంగిలో వేరుశెనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని చెప్పారు.తెలంగాణలో ఆప్లాటాక్సిన్ రహిత వేరుశెనగ రావడం ప్రపంచమార్కెట్ లో డిమాండ్ ఉంటుందన్నారు. రాష్ట్రంలోనూతన వేరుశెనగ వంగడాలను కనుగొనేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం సంక్షోభం నుండి సంవృద్ది వైపు పనినిస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయంలో వ్యవసాయ శాఖ పని తీరు అభినందనీయమన్నారు. కేసీఅర్  నాయకత్వంలో తెలంగాణలో రెండో హరిత విప్లవం మొదలయిందని, మత్స్య పరిశ్రమలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్ విప్లవం, పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం మొదలయిందని చెప్పారు.


ఇల్లంతకుంట ప్రాంతం ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామా. కానీ నేడు అక్కడ లక్ష టన్నుల దిగుబడి పెరిగిందని తెలిపారు. రాష్ట్రం శక్తిని మార్చే సత్తా వ్యవసాయరంగానికి ఉందని అన్నారు. రాష్టంలో రెండు కోట్ల పైచిలుకు జనాభా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యవసాయరంగం నుండి ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో వరి సాగును తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.అవసరాలకు సరిపడా పండ్లు, కూరగాయలు పండించడం లేదు. చిన్న కమతాలలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని అన్నారు.

Updated Date - 2021-08-10T23:05:18+05:30 IST