లాక్‌డౌన్‌ పొడిగింపుపై నేడు కేబినెట్‌లో నిర్ణయం

ABN , First Publish Date - 2021-05-30T07:53:12+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ విషయాన్ని ఆదివారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో తేల్చనుంది.

లాక్‌డౌన్‌ పొడిగింపుపై నేడు కేబినెట్‌లో నిర్ణయం

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ విషయాన్ని ఆదివారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో తేల్చనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లాక్‌డౌనే ప్రధాన చర్చనీయాంశం కానుంది. దీంతోపాటు వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. అయితే లాక్‌డౌన్‌పై ఇప్పటికే ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించింది. లాక్‌డౌన్‌ విధింపు వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వ పెద్దలే ప్రకటిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ విజృంభించిన మొదట్లో కరోనా కేసులు 10 వేల మార్కును దాటాయి. 


ఇప్పుడు ఒక్కో రోజు 90 వేలకు పైగా టెస్టులు చేసినా.. మూడు వేల పైచిలుకు కేసులే నమోదవుతున్నాయి. ఇది లాక్‌డౌన్‌ ఫలితమేనని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా లాక్‌డౌన్‌ను జూన్‌ 7 వరకు పొడిగిద్దామన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌  పొడిగిస్తేనే మంచిదని కొంత మంది అభిప్రాయపడగా.. మరికొందరు పొడిగింపు వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని, ఇప్పటికే 20 రోజులకు పైగా నానా తిప్పలు పడుతున్నారని ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా కూలి పనులు చేసుకునేవారు, చిరు వ్యాపారులు ఉపాధి కరువై రోడ్డున పడుతున్నారని వివరించినట్లు సమాచారం. పైగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఇవ్వడం వల్ల తక్కువ సడలింపు సమయంలో రోడ్లపై జనం ఒకేసారి కిక్కిరిసిపోతున్నారని, మిగతా 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను అమలు చేసినా ఫలితమేముందని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే లాక్‌డౌన్‌ విధింపుతో కొంతలో కొంతైనా కేసులు తగ్గుతున్నాయని, ఈ దృష్ట్యా మరికొంత కాలం పొడిగించినా ఇబ్బంది లేదంటూ కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడినట్లు తెలిసింది. దీనికితోడు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి కూడా ప్రభుత్వం సమాచారాన్ని సేకరించింది. ఈ వివరాలన్నింటిపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించనుంది. 


వైద్య శాఖకు నిధుల పెంపుపై

కరోనా పేషంట్లకు వైద్యం అందించడానికి పలు రకాల వసతులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది, టెక్నీషియన్ల నియామకాలు చేపట్టాల్సి వస్తోంది. కొన్ని శాఖలకు కేటాయించిన నిధులే సక్రమంగా వ్యయం కావడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. వైద్యం, హోంశాఖ వంటి వాటికి ఎక్కువ నిధులు వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలా అవసరమైన శాఖలకు నిధులు పెంచి, అనవసర శాఖలకు నిధులను తగ్గిద్దామంటూ సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకు నిధులు పెంచాలన్న ఆలోచనలో సీఎం ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖకు రూ.6295 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు సరిపోయేలా లేవు. అందుకే కేబినేట్‌లో నిధుల పెంపుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Updated Date - 2021-05-30T07:53:12+05:30 IST