సమానత్వం వచ్చే వరకు పోరాటాలు ఆగవు
ABN , First Publish Date - 2021-12-31T05:52:06+05:30 IST
సమానత్వం వచ్చే వరకు పోరాటాలు ఆగవు

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
శంభునిపేట (వరంగల్), డిసెంబరు 30 : సమాజంలో దోపిడీలు, అక్రమాలు తొలిగి ప్రజలం తా సమానత్వం వచ్చే వరకు ప్రజా పోరాటాలు ఆగవని సీపీఎం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు (సీపీఎం) వరంగల్ జిల్లా ప్రథ మ మహాసభలను గురువారం శంభునిపేటలో ని ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. పిన్నింటి తిరుపతి రెడ్డినగర్ వేదికగా రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి ఎం.సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాఘవులు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రజల పోరాటాల వలె ఎర్ర జెండా ఎటూ పోదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడలేని ప్రధాని మోదీ.. దేశాన్ని ఎలా కాపాడుతాడో ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్రంలో మోసపూరిత హామీలతో నిరంకుశ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు విలవిల్లాడుతున్నారన్నారు. కార్పొరేట్ ప్రభుత్వాలను కూల్చటానికి ఎర్ర జెండాలు కదులుతున్నాయన్నారు. కరోనాను సైతం పెట్టుబడి దేశాలు వ్యాపార అవసరాలుగానే చూస్తున్నాయన్నారు. కమ్యూనిస్టు, సోషలిస్ట్ దేశాల్లో ఆప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజ లను కాపాడారని అన్నారు. విభిన్న దేశాల నుంచి వచ్చే పర్యాటకులతో కేరళలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా అక్కడి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ, మరణాల రేటును నివారించిందన్నారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోందన్నారు.
కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య మాట్లాడుతూ.. ఉద్యమాలతోనే సీపీఎం ప్రజల్లోకి వచ్చిందని, ప్రజల సమస్యలను తీర్చటానికి పార్టీ ఎప్పడూ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యకర్తలు ఎర్ర జెండాలు, దుస్తులతో శంభునిపేట ప్రాంతం ఎరుపు రంగుగా మారింది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు నలిగంటి రత్నమాల, వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యదర్శులు రంగయ్య, సుక్కయ్య, సిద్దం రాము, ప్రత్యూష, నాయకులు పాల్గొన్నారు.