అదనపు ధాన్యం మేమే కొంటాం

ABN , First Publish Date - 2021-12-25T07:04:42+05:30 IST

వానాకాలం సీజన్‌కు సంబంధించి.. కేంద్రం విధించిన 60 లక్షల

అదనపు ధాన్యం మేమే కొంటాం

  • సేకరణపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వకుంటే
  • బియ్యంగా మార్చి ఇండియా గేట్‌ వద్ద పారబోస్తాం
  • వానాకాలం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తాం
  • ఢిల్లీలో మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు
  • రాజకీయ ప్రయోజనాలు ఆశించి పనిచేయడం
  • మంచిది కాదు: మంత్రి నిరంజన్‌రెడ్డి
  • కిషన్‌రెడ్డి, బండి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పయనమైన మంత్రులు

 

న్యూఢిల్లీ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించి.. కేంద్రం విధించిన 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి మించి వచ్చే ధాన్యమంతటినీ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌ తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తామని చెప్పారు. మొత్తం పంటను తీసుకుంటామని కేంద్రం రాతపూర్వక హామీ ఇవ్వకపోతే ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఢిల్లీలోని ఇండియా గేట్‌వద్ద పారబోస్తామని హెచ్చరించారు.


ఎంతధాన్యం వస్తే అంత తీసుకుంటామని పార్లమెంటులో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన ప్రకటనపై లిఖిత హామీకోసం మూడు రోజులు వేచి చూశామని, కేంద్ర ప్రభుత్వ విజ్ఞతను ఇంకా పరిశీలిస్తామని, రెండు, మూడు రోజుల తర్వాత పరిస్థితి బేరీజు వేసుకొని.. రైతాంగాన్ని కూడా అడిగి జరగాల్సింది పెద్దఎత్తున జరిపించడానికి సమాయత్తం అవుతామని ప్రకటించారు.శుక్రవారం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, శ్రీనివా్‌సరెడ్డి, లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రులు మీడియాతో మాట్లాడారు. 




రెండోసారి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు

రాష్ట్ర రైతాంగాన్ని అవమానించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు.  యాసంగి బియ్యాన్ని తీసుకోబోమని కేంద్రమంత్రి గోయల్‌ పదేపదే చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఢిల్లీలో మూడు రోజులు వేచి చూసిన తర్వాత గోయల్‌ అపాయింట్‌మెంట్‌ లభించిందని, వానాకాలం ధాన్యం మొత్తాన్ని తీసుకుంటామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరితే.. రెండు రోజుల్లో చెబుతానని అన్నారని తెలిపారు. ఆ గడువు పూర్తయ్యాక అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా దొరకలేదని చెప్పారు. కేంద్రం అహంకారపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే శిక్షిస్తారని, తెలంగాణ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 


సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం తీరు

కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నిరంజన్‌రెడ్డి అన్నారు. నూతన సమాఖ్య వ్యవస్థను అమలు చేస్తానని ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికల ముందు మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ దయాదాక్షిణ్యాల మీద రాష్ట్రాలు నడవాలన్న ధోరణి తగదని హితవు పలికారు. నీతీ ఆయోగ్‌ సిఫారసులను కూడా పాటించకుండా కేంద్రం అభిప్రాయాలను రాష్ట్రాలపై రుద్దుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, ఇతర రాష్ట్రాలకు మరో న్యాయం అమలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నా అధికారాలన్నీ కేంద్రం సాధ్వీనం చేసుకున్నదని.. గోదాంలు, ఎగుమతి విధానం వంటివి చేతిలో పెట్టుకు ని ఉత్పత్తులు వచ్చినప్పుడు చేతులెత్తేస్తామంటే చేతగానితనమనాలా ఏమనాలి అని ప్రశ్నించారు.


వారు తెలంగాణ బిడ్డలేనా?: ఎర్రబెల్లి

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. అసలు వాళ్లు తెలంగాణ బిడ్డలేనా అన్న అనుమానం వస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి గోయల్‌కు రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. కాగా, ఆరు రోజుల పర్యటనను ముగించుకొని రాష్ట్ర మంత్రులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ తిరిగి పయనమయ్యారు. వానాకాలం ధాన్యం సేకరణపై రాతపూర్వకంగా హామీ ఇస్తామన్న కేంద్ర మంత్రి గోయల్‌ నుంచి స్పందన లేదు. చివరికి సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపిన తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించి  మంత్రులు హైదరాబాద్‌కు వెళ్లారు.




గోయల్‌ చాలా అబద్ధాలు చెప్పారు: గంగుల

గోదాంలు ఖాళీ లేవని ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోలేదని, గత ఏడాది బియ్యాన్ని తీసుకెళ్లాలని ఏడుసార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందించలేదని దీనికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం విధించిన 60 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం పూర్తయ్యిందని, పరిమితి పెంపుపై రెండు రోజుల్లో చెబుతామని కేంద్ర మంత్రి పేర్కొనగా వారం వేచి చూశామని తెలిపారు. తమతో కేంద్ర మంత్రి గోయల్‌ చాలా అబద్ధాలు చెప్పారని, గత సీజన్‌ బియ్యమే ఇవ్వలేదని అన్నారని, కానీ బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తీసుకునే బాధ్యత ఎఫ్‌సీఐదేనని స్పష్టం చేశారు. రైల్వే ర్యాకులు లేవని, సరుకు రవాణా జరగడం లేదని, గోడౌన్లు లేవని చెప్పి నెపాన్ని తమపై వేస్తున్నారని, ఇది సరికాదని ఆయన అన్నారు.


Updated Date - 2021-12-25T07:04:42+05:30 IST