భవన అనుమతులు.. కలెక్టర్లతో కుదరదు

ABN , First Publish Date - 2021-08-27T09:29:26+05:30 IST

జిల్లాల్లో ఇప్పటికే పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న కలెక్టర్లకు భవన నిర్మాణ అనుమతుల బాధ్యతలను అప్పగించడం సరికాదని క్రెడాయ్‌ సూచించింది. ప్రతీ జిల్లాలో టీఎ్‌సబీపా్‌సకు ప్రత్యేక..

భవన అనుమతులు.. కలెక్టర్లతో కుదరదు

విడిగా మరో ఐఏఎస్‌ను పెట్టండి

ప్రభుత్వానికి క్రెడాయ్‌ విజ్ఞప్తి


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో ఇప్పటికే పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న కలెక్టర్లకు భవన నిర్మాణ అనుమతుల బాధ్యతలను అప్పగించడం సరికాదని క్రెడాయ్‌ సూచించింది. ప్రతీ జిల్లాలో టీఎ్‌సబీపా్‌సకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, దాని పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో ఐఏఎ్‌సను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. క్రెడాయ్‌ తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో క్రెడాయ్‌ తెలంగాణ చైర్మన్‌ సీహెచ్‌ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి మాట్లాడారు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ ఇలా పలు విభాగాలను తొలగించి పూర్తిగా కలెక్టర్లకు నిర్మాణ అనుమతుల బాధ్యత ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ పెంచడం వల్ల ఇబ్బందులు లేవని చెప్పారు. అయితే, స్టాంఫ్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచడం వల్ల మాత్రం కొనుగోలుదారులకు భారమవుతుందన్నారు.


ఇతర రాష్ట్రాల్లో రూ.45 లక్షల విలువ దాటిన ఆస్తులకు ప్రభుత్వాలే స్వచ్ఛందంగా 2.5 శాతం రాయితీ ఇస్తున్నాయని ప్రస్తావించారు. ఆ విధానాన్ని రాష్ట్రంలోనూ అనుసరించాలని కోరారు. యూడీఎస్‌, ఫ్రీలాంచ్‌ స్కీమ్‌లను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వీటివల్ల మార్కెట్‌ ఒడిదుడుకులకు గురవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రెడాయ్‌కు రాష్ట్రంలో 11 జిల్లాలో కమిటీలు ఉన్నాయని వెల్లడించారు. మరో 20 జిల్లాల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక

క్రెడాయ్‌ తెలంగాణ చైర్మన్‌గా సీహెచ్‌ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడిగా డి.మురళీకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులుగా జి.అజయ్‌కుమార్‌, జగన్‌ మోహన్‌ చిన్నాల, వి.మధుసూదన్‌రెడ్డి, బి.పాండురంగారెడ్డి, సహాయ కార్యదర్శిగా జి.శ్రీనివా్‌సగౌడ్‌, కోశాధికారిగా ఎం.ప్రశాంతరావు, క్రెడాయ్‌ యూత్‌వింగ్‌ తెలంగాణ కోఆర్డినేటర్‌గా సి.సంకీర్త్‌ ఆదిత్యరెడ్డి, కార్యదర్శిగా రోహిత్‌ అశ్రిత్‌ ఎన్నికయ్యారు. ప్రేమ్‌సాగర్‌రెడ్డిని రెండేళ్ల తర్వాత బాధ్యతలు తీసుకోబోయే కార్యవర్గానికి ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా ఎంపిక చేశారు. 

Updated Date - 2021-08-27T09:29:26+05:30 IST