యాజమాన్య ధ్రువీకరణ పత్రాలకు బ్రేక్!
ABN , First Publish Date - 2021-08-27T10:23:56+05:30 IST
గ్రామ పంచాయతీల్లో ఇళ్ల యజమానులకు కొత్త చిక్కొచ్చిపడింది. ఇళ్ల యాజమాన్య హక్కు ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు, ఇళ్ల క్రయవిక్రయాలకు, భాగ పంపిణీలకు ఆటంకం కలుగుతోంది. పంచాయతీల్లో ఇలాంటి పత్రాల జారీ
పంచాయతీ కార్యదర్శుల అధికారానికి కత్తెర
రుణాలు, క్రయవిక్రయ సమయాల్లో ఇక్కట్లు పడుతున్న ఇంటి యజమానులు
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్
మహబూబ్‌నగర్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రామ పంచాయతీల్లో ఇళ్ల యజమానులకు కొత్త చిక్కొచ్చిపడింది. ఇళ్ల యాజమాన్య హక్కు ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు, ఇళ్ల క్రయవిక్రయాలకు, భాగ పంపిణీలకు ఆటంకం కలుగుతోంది. పంచాయతీల్లో ఇలాంటి పత్రాల జారీ అధికారాన్ని పంచాయతీ కార్యదర్శుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తర్వులివ్వడంతో ఈ సమస్య తలెత్తింది. గ్రామాల్లో సైతం పక్కా ఇళ్ల నిర్మాణాలు పెరగడం, ఆ ఇళ్లకు విలువ సైతం పెరగడంతో బ్యాంకులు ఇళ్ల పత్రాలు తాకట్టు పెట్టుకొని రుణాలిస్తున్న పరిస్థితి ఇటీవల కాలంలో పెరిగింది. రుణాల కోసమే కాకుండా ఇళ్ల క్రయవిక్రయాల సమయంలోనూ, ఉమ్మడి కుటుంబాలు విడిపడ్డప్పుడు భాగ పంపిణీలకు కూడా ఈ పత్రాల ఆధారంగానే వ్యవహారాలు చక్కబెడుతున్నారు. చట్టపరంగా, న్యాయపరంగా ఈ సర్టిఫికెట్ ఉంటే క్రయ, విక్రయానికి, భాగ పంపిణీకి కూడా చట్టబద్ధత కలుగుతుండటంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది.
ఫిబ్రవరి 20 వరకు పంచాయతీల్లో కార్యదర్శులే ఇంటి పన్నుల రిజిస్టర్లు, రివిజన్ రిజిస్టర్లలో నమోదైన ఇంటి యజమానుల వివరాల ఆధారంగా యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ వచ్చారు. అయితే ఉమ్మడి కుటుంబాలు వేరుపడేటప్పుడు యజమానిగా కుటుంబ పెద్ద ఉంటే, విడిపడ్డాక బై నెంబర్లతో ఆయా భాగాల మేరకు వివరాలు నమోదు చేసిన చోట ఇబ్బందులు ఉండేవి కావు. అయితే కొన్ని చోట్ల భాగ పంపిణీలయ్యాక కూడా ఇంటిపెద్ద పేరున, లేక గ్రామంలో ఉండే కుటుంబీకుల పేరునే ఇంటి యజమానిగా పన్నుల రిజిస్టర్, రివిజన్ రిజిస్టర్‌లో వస్తున్నాయని, ఇతర భాగస్తుల అభ్యంతరాలూ భారీగా రావడంతో ఇబ్బందికరంగా మారిందని కార్యదర్శులు వాపోయారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను నిలిపివేస్తూ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు.
ఆరు నెలలుగా అదే స్థితి
వ్యవసాయ పనుల నిమిత్తం, పిల్లల పెళ్లిళ్లు, ఉన్నతవిద్య తదితర అవసరాల కోసం ఇళ్లను తాకట్టుపెట్టుకొని బ్యాంకుల్లో రుణాలు పొందే వారికి ఇప్పుడు ఈ సర్టిఫికెట్లు లేకపోవడంతో రుణాలు పొందలేని పరిస్థితి నెలకొంది. ఆరునెలలుగా ఈ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో ఇళ్ల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ విషయమై మహబూబ్‌నగర్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లును ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే సర్టిఫికెట్లును జారీ చేస్తామని చెప్పారు.