అజ్ఞాతంలో పుట్ట మధు!
ABN , First Publish Date - 2021-05-08T07:54:26+05:30 IST
టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్.. వారం రోజులుగా ఆచూకీ తెలియకుండా పోయారు.

- వారం రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్
- గన్మన్లు ఆయన వెంటే ఉన్నారంటున్న పోలీసులు
- ఈటలకు సన్నిహితంపై సీఎం అసంతృప్తి!
- సీఎంను కలిసేందుకు కుటుంబసభ్యుల విఫల యత్నం
పెద్దపల్లి, మే 7 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్.. వారం రోజులుగా ఆచూకీ తెలియకుండా పోయారు. శుక్రవారం కూడా మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న అంశం మిస్టరీగా మారింది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితంగా మెలగడంతోపాటు ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్లు, దీంతో ఆయనపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
ఈ కేసులో పుట్ట మధు పాత్ర ఏమీ లేదని పోలీసులు గతంలో తేల్చడంతోపాటు టీఆర్‌ఎ్‌సకు చెందిన ప్రజాప్రతినిధుల పాత్ర లేదని సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. అయితే న్యాయవాదుల హత్యకు రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారనే లేఖ ఒకటి ఇటీవల రాష్ట్ర స్థాయి పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా చార్జీషీట్ దాఖలు కాకపోవడంతో.. కేసు మలుపు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ నేత, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును టీఆర్ఎస్లోకి తీసుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోందనే ప్రచారం వల్లే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెప్పుకొంటున్నారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదంటూ శ్రీధర్‌బాబు ‘ఆంధ్రజ్యోతి’తో స్పష్టం చేశారు.
ఎన్నో అనుమానాలు..
పుట్ట మధు అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనర్ మాత్రం మధు వెంటే గన్మన్లు ఉన్నారని అంటున్నారు. మధు సతీమణి, మంథని మునిసిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, ఆయన కుమారుడు, కోడలు కలిసి గురువారం హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంను కలిసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కానీ, ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిశారు. తాము టీఆర్ఎస్లోనే ఉన్నామని, పార్టీని వీడబోమని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించాలని మంత్రిని వారు కోరినట్లు సమాచారం.మరోవైపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా పుట్ట మధు గురించి సీఎంకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పుట్ట మధు ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలుసునన్న ప్రచారం జరుగుతోంది.