ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు

ABN , First Publish Date - 2021-05-30T05:36:26+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


ఎంజీఎంలో బ్లాక్‌ ఫంగస్‌ ప్రత్యేక వార్డు ప్రారంభం  


హన్మకొండ అర్బన్‌, మే 29 : సీఎం కేసీఆర్‌ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు లభ్యమవుతున్నాయని, ఎంజీఎం ఆస్పత్రిలోని డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది అంకితభావం, చిత్తశుద్ధితో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించాలని మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం 50 పడకలతో కూడిన వార్డును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎంజీఎంను సీఎం కేసీఆర్‌ ఇటీవల సందర్శించిన అనంతరం ఆస్పత్రిలో కరోనా బాధితులకు మెరుగైన సేవలందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. రోగులకు అందుతున్న సేవలపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 

కరోనా చికిత్సకు ఎంజీఎంలో ప్రత్యేకంగా 800 బెడ్లు కేటాయించగా, అందు లో ఐసీయూతో సహా ఆక్సిజన్‌తో కూడిన 650బెడ్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 506 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, 294 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో 95 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కొవిడ్‌ విధుల్లో నిమగ్నమయ్యారని, వీరికి తోడు ముగ్గురు కొవిడ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు 55 మంది పారామెడికల్‌ సిబ్బంది, 60 మంది పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఎంజీఎంలో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమస్యలను కలెక్టర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పరిష్కరించాలని ఆదేశించారు. కరోనా బాధితుల సమాచారాన్ని ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. ఎంజీఎంలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల అక్రమాల కారణంగా రోగులు, వారి బంధువులు స్నేహితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయని, కేఎంసీ 1986 బ్యాచ్‌కు చెందిన డాక్టర్లు, కాళోజీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రవీణ్‌రావు రూ.20 లక్షల విలువైన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, మాస్కులు అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు.  దాతలకు కృతజ్ఞతలు తెలిపి వారిని మంత్రి సన్మానించారు. ఎంజీఎంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సేవలను మంత్రి కొనియాడారు. వరంగల్‌ కేంద్ర కారాగారం ప్రాంగణంలో అన్ని వసతులతో నూతన భవనాలను నిర్మించి ఎంజీఎం ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చి దిద్దుతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, రాజ్యసభ సభ్యుడు గుండా ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ హన్మంతు, మునిసిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యారాణి, వైద్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-30T05:36:26+05:30 IST