రణరంగం
ABN , First Publish Date - 2021-02-01T06:05:43+05:30 IST
బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల పరస్పర దాడులతో ఆదివారం వరంగల్ నగరం రణరంగంగా మారింది. పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలతో ఏకంగా దాడులు, ప్రతీకార దాడులకు దిగే వరకు వచ్చింది. ఆదివారం ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయగా, ఇందుకు ప్రతీకారంగా టీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.

ఓరుగల్లులో రాజుకున్న రాజకీయ అగ్గి
భగ్గుమన్న బీజేపీ, టీఆర్‌ఎస్ శ్రేణులు
చల్లా వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం
హన్మకొండలోని ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడి
రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలను విసిరిన కార్యకర్తలు
ఇంటి అద్దాలు, పూల కుండీలు ధ్వంసం
పరిశీలించిన ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్
ధర్మారెడ్డికి మంత్రి ఎర్రబెల్లి, టీఆర్‌ఎస్ నేతల పరామర్శ
బీజేపీ నాయకులారా.. ఖబర్దార్ అంటూ హెచ్చరిక
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
విడుదల చేయాలని సుబేదారి పోలీస్‌స్టేషన్ ఎదుట పార్టీ శ్రేణుల ధర్నా
బీజేపీ కార్యాలయం, నేతల ఇళ్లపై టీఆర్‌ఎస్ ప్రతి దాడి
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: రావు పద్మ
హన్మకొండ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల పరస్పర దాడులతో ఆదివారం వరంగల్ నగరం రణరంగంగా మారింది. పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలతో ఏకంగా దాడులు, ప్రతీకార దాడులకు దిగే వరకు వచ్చింది. ఆదివారం ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయగా, ఇందుకు ప్రతీకారంగా టీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సుబేదారి పోలీసు స్టేషన్ ఎదుట దీక్ష చేపట్టారు. స్టేషన్ వద్ద నిలిపి ఉన్న బీజేపీ వాహనాలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్ళు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడులపై ఉభయ పార్టీల నేతలు ఖబర్దార్ అంటే ఖబర్దార్ అని హెచ్చరికలు చేసుకున్నారు.
నిధుల సేకరణపై..
అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధుల సేకరణకు సంబంధించి కొద్ది రోజుల కిందట పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధర్మారెడ్డి ఒక సమావేశంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ధర్మారెడ్డి ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘రామాలయం నిర్మాణం పేరుతో బీజేపీ శ్రేణులు ఇంటింటికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దొంగ బుక్కులు పట్టుకొని చందాల దందాలకు పాల్పడుతున్నారు. గుడి నిర్మాణం పేరుతో తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు రూ.1000కోట్లు వసూలు చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇక దేశంలో ఎంత వసూలు చేస్తారో? అయోధ్య రామాలయం పేరుతో వసూలు చేస్తున్న నిధులకు లెక్క చెప్పాలి. లెక్కలు చూపే వరకు పోరాటం చేస్తాం. శ్రీరాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. వికృత చేష్టలకు పాల్పడుతోంది’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇంటిపై దాడి
టీవీల్లో, సోషల్ మీడియాలో ధర్మారెడ్డి వ్యాఖ్యలను చూసిన బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. సుమారు 150 మంది బీజేపీ కార్యకర్తలు పార్టీ పతాకాలతో హన్మకొండలోని బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ధర్మారెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇంటిపై పెద్ద ఎత్తున రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటి ముందు బైఠాయించారు. దాడిలో ఇంటి అద్దాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల చేతుల్లోని లాఠీలను సైతం లాగి ఇంటిపైకి విసిరేశారు. దీంతో వారికి కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగింది. అరుపులు, కేకలు, నిరసన నినాదాలతో ఎమ్మెల్యే నివాసం ఆవరణ రణరంగంగా మారింది. పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దాడి జరిగిన సమయానికి ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంట్లో లేరు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పరకాలకు వెళ్లారు. ఎమ్మెల్యే సతీమణితో పాటు ముగ్గురు పనిమనుషులు మాత్రమే ఉన్నారు. ఇంటి లోపల ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారు. దాడి సమాచారం తెలుసుకొని ఎమ్మెల్యే ధర్మారెడ్డి హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కాగా, సీపీ ప్రమోద్ కుమార్ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి దాడి సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. దాడి జరిగిన తీరును పరిశీలించారు. దాడి నేపథ్యంలో ఎమ్మెల్యే నివాసం ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీజేపీ కార్యాలయంపై..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ కార్యకర్తలు జరిపిన దాడికి ప్రతీకారంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు హన్మకొండ హంటర్‌రోడ్డులోని బీజేపీ అర్బన్ కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడికి దిగారు. రాళ్లు విసిరారు. కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను చించివేశారు. తోరణాన్ని కూల్చివేశారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ధ్వంసం అయ్యాయి. కిటికీలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన కొద్దిసేపటికే టీఆర్‌ఎస్ శ్రేణులు వివిధ వాహనాల్లో బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకొని దాడికి దిగారు. రాళ్ల వర్షం కురిపించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని తోసేశారు. సుమారు అరగంట పాటు దాడి కొనసాగింది. కార్యకర్తల నిరసనలు, నినాదాలతో హంటర్‌రోడ్డు రణరంగంగా మారింది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.
బీజేపీ నేతల ఇళ్ళపై..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై దాడిలో పాల్గొన్న బీజేపీ ముఖ్య నేతల ఇళ్లపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. సుమారు 50 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి మోటార్ సైకిళ్లపై బీజేపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లారు. వరంగల్ అబ్బనికుంట ప్రాంతంలోని బీజేపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్, ఎల్‌బీనగర్‌లోని బీజేవైఎం నాయకుడు అపురూపసాయి ఇంటికి వెళ్లి తలుపులను బాదారు. ఇంటి ముందున్న సామగ్రిని చిందర వందర చేశారు. కుర్చీలు, బెంచీలను ఎత్తిపడేశారు. దీంతో ఇళ్లలోని వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అలాగే హన్మకొండ ఎన్‌జీవో్‌స కాలనీలోని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్ళతో దాడి చేశారు. ఇంటి వద్ద ఉన్న బీజేపీ కార్యకర్తలను కర్రలతో కొట్టారు. బ్యానర్లు చించివేశారు. రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదెల్లలోని బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఇంటి ప్రహరీని జేసీబీ సాయంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభిమానులు ధ్వంసం చేసినట్టు తెలిసింది. తన ఇంటి గోడ ధ్వంసానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు విజయ్‌చందర్‌రెడ్డి తెలిపారు.
బీజేపీ నాయకుల అరెస్టు
వరంగల్ అర్బన్ క్రైం/హన్మకొండ టౌన్, జనవరి 31: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిచేసిన 55 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని సుబేదారి, కేయూ పీఎ్‌సలో ఉంచారు. అరెస్టు చేసిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా అమరేందర్‌రెడ్డి, కొండేటి శ్రీధర్, కొలను సంతో్‌షరెడ్డి, రత్నం, మేఘరాజ్, సుమన్‌ఖత్రి, కూచన క్రాంతి, జెండా రమే్‌షలతో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరిని ఆదివారం రాత్రి పొద్దుపోయాక వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్టు సీఐ నరే్‌షకుమార్ తెలిపారు. బీజేపీ సీనియర్ నేత చాడ శ్రీనివా్‌సరెడ్డితో పాటు మరో 21 మందిని కేయూకు తరలించారు. వీరిని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు స్టేషన్‌లో పరామర్శించారు. కాగా, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, మంత్రి ఎర్రబెల్లిపై రావు పద్మ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయంపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసేందుకు వీరిద్దరూ పోత్సహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుబేదారి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
కార్యకర్తలను విడుదల చేయాలంటూ బీజేపీ నాయకుల నినాదాలు
బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నాయకత్వంలో నేతలు సుబేదారి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి సంఘటనలో అరెస్టు చేసిన తమ కార్యకర్తలను విడుదల చేయాలని, తమ కార్యాలయంపై, నేతల ఇళ్లపై దాడి చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆదివారం రాత్రి పొద్దు పోయే వరకు ఆందోళన కొనసాగించారు. తమ కార్యకర్తలను విడుదల చేసే వరకు అక్కడి నుంచి కదిలేదు లేదంటూ భీష్మించారు. టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడం పోలీసుస్టేషన్ ఆవరణ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట సర్కిళ్ళకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సుబేదారి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు.
పరిణామం తీవ్రంగా ఉంటుంది: రావు పద్మ
రామమందిర నిర్మాణంపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకే ఆయన నివాసానికి వెళ్లామని, పోలీసులు తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. తమ కార్యాలయంపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో విచ్చలవిడిగా దాడి చేశారన్నారు. మరి వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తమపై దాడికి కచ్చితంగా తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రామమందిర నిర్మాణం కొరకు ప్రజలు సమర్పించిన ప్రతీ పైసాకు లెక్క ఉందన్నారు. యువరాజు మెప్పుకోసమే టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. చలా ధర్మారెడ్డి తన వ్యాఖ్యలకు బేషరతుగా శ్రీరామభక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.




ఖబర్దార్: మంత్రి ఎర్రబెల్లి
‘‘బీజేపీ
కార్యకర్తలు ఖబర్దార్.. టీఆర్‌ఎస్ శ్రేణులు తలుచుకుంటే ఉరికించి
కొడతారు..’’ అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
హెచ్చరించారు. హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై
బీజేపీ శ్రేణులు దాడి చేశారన్న సమాచారం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి..
ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి
కడియం శ్రీహరితో పాటు పలువురు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో కలిసి ధర్మారెడ్డి
ఇంటికి చేరుకొని ఆయనను పరామర్శించారు. బీజేపీ కార్యకర్తల దాడిని ఖండించారు.
ధర్మారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి
దయాకర్‌రావు మాట్లాడారు. తమది అధికార పార్టీ కనుక సంయమనం
పాటిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రతీకార చర్య లకు
పాల్పడవద్దని కోరారు. కేంద్రంలోని బీజేపీ నేతలు వరంగల్‌లో వారి పార్టీ
నాయకులు పాల్పడుతున్న ఆరాచకాలను అరికట్టాలని, వారికి బుద్దిచెప్పాలని
కోరారు.
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మా ట్లాడుతూ.. ఎమ్మెల్యే
నివాసంపై బీజేపీ శ్రేణులు ఒక పధకం ప్రకారం దాడి చేశారన్నారు. దొంగల్లా
వచ్చి దాడి చేయడం ద్వారా తామేదో ఘనకార్యం సాధించామనుకుంటున్నారని, ఇది
పిరికి పం దచర్య అని ఖండించారు. దాడిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యా
రని ఆరోపించారు. రాను న్న కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న
దురుద్దేశంతోనే ఈ దాడికి పాల్పడ్డారన్నారు. నరంపేట ఎమ్మెల్యే పెద్ది
సుదర్శన్‌రెడ్ది మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు గుండాలను తలపించే రీతిలో
దాడికి తెగబడ్డారన్నారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై ఇప్పటికే నాలుగు
సార్లు దాడులు చేశారని, టీఆర్‌ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే నాలుగు లక్షల
దాడులు చేస్తారని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి.
డాక్టర్ టి.రాజయ్య కూడా దాడిని ఖండించారు.














