కారు.. కమలం.. వరిపై సమరం!

ABN , First Publish Date - 2021-10-29T08:22:43+05:30 IST

వరి సాగు, ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు

కారు.. కమలం.. వరిపై సమరం!

  • ధాన్యం కొనుగోలుపై సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • కేంద్రం రాసిన లేఖ బయటపెట్టండి
  • లేదా రాజీనామా చేయండి.. సీఎంకు సంజయ్‌ డిమాండ్‌
  • బీజేపీ కార్యాలయంలో మూడు గంటల రైతు దీక్ష
  • రాష్ట్రంలో ‘వరి బంద్‌’ పథకం అమలుకు యత్నమని ఆరోపణ
  • ముడి బియ్యం ఎంతైనా కొనడానికి కేంద్రం రెడీ అని స్పష్టం
  • సిద్దిపేట కలెక్టర్‌ను సస్పెండ్‌ చేసే దాకా పోరు: రఘునందన్‌
  • యాసంగి వడ్లు కొనేలా కేంద్రం నుంచి లేఖ తీసుకు రావాలి
  • లేదా కిషన్‌రెడ్డి, సంజయ్‌ రాజీనామా చేయాలి: నిరంజన్‌ 
  • ప్రధాని, కేంద్ర మంత్రి ద్వారా ప్రకటన చేయిస్తారా?: జగదీశ్‌ 
  • కేంద్రం నుంచి లేఖ తెస్తే సంజయ్‌ కాళ్లు మొక్కుతా: ఎర్రబెల్లి
  • రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
  • వరి విత్తనాలు అమ్మకూడదంటూ ఉత్తర్వులు ఇవ్వలేదు: పల్లా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

వరి సాగు, ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ధాన్యం కొనకపోవడానికి బీజేపీనే కారణమని టీఆర్‌ఎస్‌ మంత్రులు ఆరోపిస్తే.. రాష్ట్రంలో వరి సాగును కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని బీజేపీ తప్పుబట్టింది. వెరసి, ఇరు పార్టీల మధ్య వరి గడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ధాన్యం కొనుగోలు చేయబోమంటూ కేంద్రం రాసిన లేఖను బయట పెట్టాలని, లేకపోతే సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరితే.. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ప్రకటన చేయించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి లేఖ తీసుకు రావాలని, గురువారం సాయంత్రానికి లేఖ తీసుకు రాలేకపోతే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ తమ పదవులకు రాజీనామా చేయాలని మరో మంత్రి నిరంజన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.


నాది తప్పయితే రాజీనామా: నిరంజన్‌ రెడ్డి

బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే యాసంగి వడ్లు కొనేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి లేఖ తీసుకు రావాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. లేకపోతే కిషన్‌ రెడ్డి, సంజయ్‌ తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. తన వాదనల్లో ఏమైనా తప్పుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్‌లో, వనపర్తిలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతుల పట్ల నిజంగా ప్రేమ ఉంటే, వారు మొనగాళ్లే అయితే.. దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రతి గింజ కొంటామనే వరకు ఆమరణ దీక్ష చేయండని ఎద్దేవా చేశారు. ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదంతా వ్యాపార ధోరణేనని విమర్శించారు. బీజేపీ నాయకులకు చేతనైతే నల్ల చట్టాలు, కరెంటు చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేసి వాటిని రద్దు చేయించాలని డిమాండ్‌ చేశారు.


వానాకాలంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇప్పటికే అవసరమున్నచోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉంటే యాసంగిలో రైతులు పండించే ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేసేలా ప్రధాని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ప్రకటన చేయించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. సూర్యాపేటలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని, రైతాంగానికి రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించి తగు సూచనలు, సలహాలు చేస్తున్నారని చెప్పారు. పంటల సాగు విషయంలో రైతులపై ఒత్తిడి తేవద్దని, రైస్‌ మిల్లర్లు, విత్తన కంపెనీలు, ఇతరులు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తే సాగు చేయనివ్వాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు చేస్తామంటూ కేంద్రం నుంచి లేఖ తీసుకొస్తే బండి సంజయ్‌ కాళ్లు మొక్కుతానని మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అసలు బండి సంజయ్‌కు సిగ్గుందా!? గిరిజన వర్సిటీ, కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ తదితర విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. రాష్ట్రానికి ఏడు మెడికల్‌ కాలేజీలు కావాలని కోరితే, కనీసం కరీంనగర్‌కు కూడా తెచ్చుకోలేని దద్దమ్మ సంజయ్‌’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


పరిమితంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తామని గత సెప్టెంబరులో ఎఫ్‌సీఐ స్పష్టం చేసిందని, అందుకే, ప్రత్యామ్నాయ సాగుకు సంబంధించి అధికారులు కొన్ని సూచనలు మాత్రమే చేశారని రైతు బంధు సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి చెప్పారు. వరి విత్తనాలు అమ్మకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా జిల్లాల కలెక్టర్లు రైతులకు సూచనలు మాత్రమే చేస్తారన్నారు. గతంలో మాదిరిగానే రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతులు వరి సాగు చేసుకోవచ్చని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు స్పష్టం చేశారు. ఇక్కడ నిరంతరం సాగునీరు ఉంటుందని, ఇతర పంటలకు అనుకూలం కాదని వివరించారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే సానుకూలంగా స్పందించిందని చెప్పారు. హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో రైతులు సన్న రకాలను ధైర్యంగా సాగు చేసుకోవచ్చని, ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే సైదిరెడ్డి హామీ ఇచ్చారని డీసీసీబీ డైరెక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డి ప్రకటించారు.


సిద్దిపేట కలెక్టర్‌పై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు

రైతులకు వరి విత్తనాలు విక్రయించవద్దని, దీనిని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా.. ఖాతరు చేయబోనంటూ సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకటరామారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర డీవోపీటీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. కలెక్టర్‌ ప్రకటన సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ఉల్లంఘనేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. కలెక్టర్‌ ప్రకటన కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందకే వస్తుందని, దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. కాగా, యాసంగిలో వరి సాగు చేయవద్దని మంత్రులు చెప్పడాన్ని నిరసిస్తూ గురువారం కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలను దహనం చేసి నిరసన తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్మల్‌ జిల్లా అబ్దుల్లాపూర్‌లో రైతులు ఆందోళన చేశారు.

Updated Date - 2021-10-29T08:22:43+05:30 IST