ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచే

ABN , First Publish Date - 2021-08-27T09:21:40+05:30 IST

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేయాలని సంకల్పించారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి

ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచే

  • తెలంగాణలో అధికార పీఠం కైవసమే లక్ష్యం
  • టీఆర్‌ఎస్‌ విధానాలను ఎండగడుతూ పయనం
  • బండి సంజయ్‌ వెంట 2,500 మంది కార్యకర్తలు
  • పాదయాత్ర నిర్వహణకు 15 ప్రత్యేక బృందాలు
  • కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, నడ్డా రాక
  • బీజేపీ చరిత్రలో తొలిసారి రాష్ట్ర అధ్యక్షుడి యాత్ర


హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేయాలని సంకల్పించారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి శనివారం ఉదయం 9.30 గంటలకు ఆయన ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చే రెండేళ్లూ( సాధారణ ఎన్నికలు జరిగే వరకూ) ఎక్కువ రోజులు పాదయాత్ర ద్వారా జనంలో ఉండబోతున్న ఆయన, టీఆర్‌ఎస్‌ మైనారిటీ సంతుష్టీకరణ విధానాలతో మెజారిటీ వర్గాలకు తీరని ద్రోహం జరుగుతోందన్న సంగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. ఎంఐఎంకు భయపడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించడం లేదంటూ ఇప్పటికే విమర్శిస్తుండగా.. ఎంఐఎం ఏ స్థాయిలో టీఆర్‌ఎ్‌సను నియంత్రిస్తుందో ఈ యాత్ర ద్వారా సంజయ్‌ ఎండగట్టబోతున్నారు.


దళితులు, గిరిజనులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలా మోసం చేస్తోందో వివరించబోతున్నారు. ‘‘దళిత బంధు ఇచ్చి టీఆర్‌ఎస్‌ ఆ వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, వారికిచ్చిన అసైన్డ్‌ భూములను పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల పేరిట లాక్కొంటోంది. వీటన్నింటినీ ఎత్తిచూపబోతున్నాం. గిరిజనుల రిజర్వేషన్‌ను మైనారిటీ రిజర్వేషన్లతో ముడిపెట్టి ఎలా వారిని మోసం చేస్తోందో వివరించబోతున్నాం’’ అని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. కాగా, బీజేపీ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు.. అందునా, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. తొలిదశలో 40 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 500 మంది పాదయాత్రీకులు సంజయ్‌ వెన్నంటి ఉంటారు. వీరితో పాటు ఆయా జిల్లాల్లో స్థానిక పార్టీ నాయకులు కనీసం 2,000 మంది ఉంటారు. ప్రతి రోజు ఒక చోట కనీసం 10 వేల మందితో సభ నిర్వహిస్తారు. రాత్రి బస, భోజనం, వసతి ఏర్పాట్లు అన్నీ సాదాసీదాగా ఉండాలని సంజయ్‌ నేతలకు నిర్దేశించారు. సంజయ్‌, ఆయనతో పాటు పాదయాత్ర చేసే ముఖ్యులు గుడారాల్లో బస చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. 


రాష్ట్రానికి 15 ప్రత్యేక బృందాలు..

సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీ కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చేవి. అయితే సంజయ్‌ పాదయాత్ర కోసం పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, అసోం రాష్ట్రాల్లో పనిచేసిన 15 ప్రత్యేక బృందాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వానికి నివేదించి, అవసరమైన రాజకీయ వ్యూహరచన చేయడం ఈ బృందం బాధ్యత. పాదయాత్రలో ఎలాంటి ప్రసంగాలు ఉండాలి? ఏ ప్రాంతంలో ఏయే సామాజిక వర్గాలను కలవాలి? తదితర అంశాలపై బృంద సభ్యులు సూచనలు చేస్తారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రత్యేక బృందం, పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో పర్యటిస్తుందని, ఎన్నికల నాటికి మరో భారీ బృందం దిగబోతోందని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. 


రాష్ట్ర పర్యటనకు అమిత్‌ షా, నడ్డా..

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంజయ్‌ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రానికి వస్తారని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఒకరు సెప్టెంబరు 17న, మరొకరు పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతారని చెప్పారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్‌ ఈనెల 28నే వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-27T09:21:40+05:30 IST