ప్రెస్‌మీట్‌లో హైడ్రామా
ABN , First Publish Date - 2021-10-30T05:14:05+05:30 IST
ప్రెస్‌మీట్‌లో హైడ్రామా
వరంగల్ సిటీ, అక్టోబరు 29: బీజేపీ సీనియర్ నాయకులు వరంగల్‌లో శుక్ర వారం తలపెట్టిన మీడియా సమావేశం హైడ్రామాకు వేదికగా నిలిచింది. పోలీ సులతో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్లితే... వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని గ్రాండ్ గాయత్రి హోటల్‌లో బీజేపీ శుక్రవారం ఉదయం ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసింది. విలేకరుల సమావేశంలో హుజూ రాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా పాల్గొంటారని సమాచారం అందడంతో వరంగల్ ఏసీపీ కలకోట్ల గిరి తమ సిబ్బందితో హోటల్ వద్దకు వచ్చారు. అక్కడ లాంజ్ లో ఉన్న బీజేపీ నేతలను కలిసి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికలపై మాట్లాడేందుకు అనుమతి లేదని, ప్రెస్‌మీట్ నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అయితే తాము ఎన్నికల ప్రచారం నిర్వహించడం లేదని, రైతుల సమస్యలపై మాట్లాడతామని వివేక్, జితేందర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, రాకేశ్‌రెడ్డి పోలీసులకు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వ హించడం చట్టవిరుద్దమని ఏసీపీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో కారులో ఈటల రాజేందర్ హోటల్‌కు చేరుకోవడంతో ఆయనను గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసి హోటల్ లోపల వున్న నేతలు.. గేట్ వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోడ్ ప్రకారం ఎన్నికల అభ్యర్థి ప్రెస్‌మీట్‌లో మాట్లాడ కూడదని లోపలికి అనుమతించేది లేదని ఏసీపీ స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈటల ప్రెస్ మీట్‌లో మాట్లాడరని నేతలు చెబుతూ ఆయనను లోపలికి తీసుకువెళ్లారు. పోలీసుల ఆంక్షలతో ఈటల హోటల్‌లోని గదికే పరిమితమయ్యారు. ఆ తర్వాత వివేక్, జితేందర్‌రెడ్డి, రావు పద్మ, రాకేశ్‌రెడ్డి తదితర నేతలు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా, ఏసీపీ గిరి లోపలికి వచ్చి ప్రెస్‌మీట్ ఆపాలని కోరారు. దీంతో నేతలు ఒక్కసారిగా ఫైర్ అయి.. హనుమకొండలో గురువారం మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెడితే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్‌ఎస్ నాయకులకు కొమ్ముకాస్తున్నారని నిలదీశారు. ప్రెస్ మీట్ ఖచ్చితంగా కొనసాగిస్తామని ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ చేశారు. పోలీసులు అక్కడ ఉండ గానే ప్రెస్‌మీట్‌లో మాట్లాడటం కొనసాగించారు. పోలీసుల వ్యవహారం సరిగా లేదని, అధికార పార్టీ నేతలకు ఓ న్యాయం, బీజేపీకి మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. మొత్తంగా నాటకీయ పరిణామాల మధ్య, పోలీసుల సాక్షిగా ప్రెస్‌మీట్ ముగిసింది. సమావేశం అనంతరం ఈటల, మాజీ ఎంపీలు, నాయకులతో కలిసి వెళ్లిపోయారు. కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి, జిల్లా ప్ర ధానకార్యదర్శులు సదానందం, హరిశంకర్, జిల్లా నాయకులు కనుకుంట్ల రంజిత్, కుసుమ సతీష్, మార్టిన్ లూథర్ పాల్గొన్నారు.
కొసమెరుపు..
పోలీసుల ఆంక్షలతో బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌లో ఉ ద్రిక్తత నెలకొనగా, అదే సమయంలో ఇద్దరు సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. అయితే మీడియా సిబ్బంది అక్కడే ఉండటంతో వారు వెంటనే గప్‌చుప్ అయిపోయారు.