అశాస్త్రీయంగా డివిజన్ల పునర్విభజన
ABN , First Publish Date - 2021-03-24T06:04:41+05:30 IST
అశాస్త్రీయంగా డివిజన్ల పునర్విభజన

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
వరంగల్ సిటీ, మార్చి 23 : జీడబ్ల్యూఎంసీ డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ముసాయిదా రూపకల్పనలో నిబంధనలను బేఖాతరు చేస్తూ టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. పునర్విభజన ముసాయిదాపై రావు పద్మ ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ నాయకులు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో అభ్యంతరాలను సమర్పించారు. కలెక్టర్‌కు సైతం తమ అభ్యంతరాలను అందజేసినట్లు రావు పద్మ విలేకరులకు వెల్లడించారు. అభ్యంతరాల తుది గడువు రోజు అధికారులు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇన్‌వార్డులో దరఖాస్తులు స్వీకరిస్తే సరిపోదని, అధికారులు ఉంటే వారితో నేరుగా చెప్పే అవకాశం ఉండేదని అన్నారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన తర్వాతే ముసాయిదాపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. అభ్యంతరాల గడువును సైతం పెంచాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, గురుమూర్తి, శివకుమార్, రత్నం, సతీష్ షా, అచ్చ విద్యాసాగర్, సదానందం గౌడ్, బాకం హరిశంకర్, తాళ్లపల్లి కుమారస్వామి, జగదీశ్వర్, సురేష్, రాజేంద్రప్రసాద్, వినోద్, రంజిత్ పాల్గొన్నారు.
వెల్లువెత్తిన అభ్యంతరాలు
కొత్తగా ఏర్పడిన 62వ డివిజన్ నుంచి సోమిడి గ్రామాన్ని విడదీయడంపై తాజా మాజీ కార్పొరేటర్ జక్కుల రమారవీందర్ అభ్యంతరం తెలిపారు. ఈ చర్య సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల మనోభావాలను దెబ్బతిసేలా ఉందన్నారు. సోమిడి గ్రామాన్ని కలుపుతూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు కానున్న 7వ డివిజన్‌లో మార్పులు చేయాల్సిన వివరాలను తెలుపుతూ 39వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామోజు నాగ సోమేశ్వర్‌రావు వినతిపత్రాన్ని సమర్పించారు. బీఎ్‌సపీ కో-ఆర్డినేటర్ గంధం శివతో పాటు ఇతర పార్టీల నేతలు నగర వాసులు, ప్రముఖులు అభ్యంతరాలను సమర్పించారు.
ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
అభ్యంతరాల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 17 నుంచి జరిగిన స్వీకరణలో మొత్తంగా 625 అభ్యంతరాలను సమర్పించారు. ఈ నెల 26 వరకు అభ్యంతరాల పరిశీలన జరగనుంది.