కేసీఆర్‌ ఇలాకలో కమలనాథుల భారీ స్కెచ్.. సక్సెస్ అయితే..!?

ABN , First Publish Date - 2021-01-12T17:24:34+05:30 IST

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీని ఢీకొట్టడమే లక్ష్యంగా

కేసీఆర్‌ ఇలాకలో కమలనాథుల భారీ స్కెచ్.. సక్సెస్ అయితే..!?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీని ఢీకొట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. సీఎం సొంత జిల్లాలోనే కారు పార్టీని కంగుతినిపించాలని తహతహలాడుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాషాయ జెండా ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అసంతృప్త నేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌ కమలానికి సన్నద్ధమవుతున్నారట. ఇంతకీ కాషాయ పార్టీ వేస్తున్న ఎత్తులు ఏమిటో ఈ కథనంలో చూద్దాం. 


భారీ స్కెచ్..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.  ఇందుకోసం అందివచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడు మీదున్న బీజేపీ నేతలు ఉమ్మడి మెదక్ జిల్లాను టార్గెట్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.  ఆపరేషన్‌ కమలం ప్రక్రియలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిపించుకోవడానికి ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ , టీఆర్ఎస్ నేతలతో వారు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలను లాగేందుకు కమలనాథులు భారీ స్కెచ్ వేశారని అంటున్నారు.


చేరికలు ఇవీ..

ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత గోదావరి అంజిరెడ్డిని బీజేపీలోకి లాగారు. ఆమె బల్దియా ఎన్నికల్లో బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు అందోల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ఆపరేషన్‌ ఆకర్ష్‌ పనిలో నిమగ్నమయ్యారన్న చర్చ జరుగుతోంది. తరచూ ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులకు వల వేస్తున్నారు. గతంలో బాబూమోహన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఆ పార్టీ నాయకులను కమలం పార్టీలోకి లాగుతున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ , మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ కమలం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా కొనసాగుతున్న సపానదేవ్‌ను కూడా ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట.


భవిష్యత్ కోసం పక్కచూపులు..

అటు సంగారెడ్డి నియోజకవర్గంలోనూ కమలం ఆపరేషన్‌ను ఆ పార్టీ ముఖ్యులు కొనసాగిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలతో నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టచ్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో అవకాశాలు రాక భవిష్యత్ కోసం వారు పక్కచూపులు చూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తుండటంతో కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రక్రియకు స్పీడ్‌ పెంచినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ఇక్కడ ఈయన కూడా బలమైన నాయకుడే.


ఆయన కూడా చేరుతున్నారా..!?

మరోవైపు మెదక్ జిల్లాకు చెందిన నర్సాపూర్ టీఆర్ఎస్ నేత, మున్సిపల్ ఛైర్మన్ మురళీయాదవ్ కూడా కమలం పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి మురళీయాదవ్ భంగపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తమలాంటి నేతలకు అధికార పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మురళీయాదవ్ త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్నా ఆయన ఖండించికపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయట. మొన్నటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా మురళీ యాదవ్ భార్య పనిచేశారు. టీఆర్ఎస్‌ పార్టీలో ఉంటే టికెట్ రాదనీ..అందుకే బీజేపీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆయన ఆశిస్తున్నారట.


వర్కవుట్ అవుతుందో లేదో..!?

ఇటీవల నర్సాపూర్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యక్రమాలకు కూడా మురళీయాదవ్ దూరంగా ఉన్నారట. అయితే ఆయన అనుచరులు మాత్రం తమను టీఆర్ఎస్ నేతలే దూరం పెడుతున్నారని వాపోతున్నారట. మురళీయాదవ్ బీజేపీలో చేరితే నర్సాపూర్‌లో ఆ పార్టీకి బలం పెరుగుతుందని వారు చెబుతున్నారు. జమిలీ ఎన్నికలు వచ్చినా లేక యథాప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరిగినా..ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సారి బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు తహతహలాడుతున్నారు. మరి బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏ మేరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.Updated Date - 2021-01-12T17:24:34+05:30 IST