టీఆర్‌ఎస్ ఆరిపోయే దీపం
ABN , First Publish Date - 2021-09-01T08:15:23+05:30 IST
ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని, టీఆర్‌ఎస్ ఆరిపోయే దీపంలాంటిదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ధర్మంతో పెట్టుకున్నారని, హుజూరాబాద్ ప్రజల శక్తి,
హుజూరాబాద్ ప్రజల శక్తి ఏంటో కేసీఆర్‌కు తెలుస్తుంది: ఈటల రాజేందర్
జమ్మికుంట రూరల్, ఆగస్టు 31: ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని, టీఆర్‌ఎస్ ఆరిపోయే దీపంలాంటిదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ధర్మంతో పెట్టుకున్నారని, హుజూరాబాద్ ప్రజల శక్తి, ఐక్యత ఏంటో ఉప ఎన్నికలో చూపిస్తారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కాపులపల్లిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈటల మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తాను గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు. ఉద్యమ సమయంలో హారీశ్‌రావు, తాను మంచి మిత్రులమని, ఇప్పుడు ఆయన తన మీద బాగా మాట్లాడుతున్నారని అన్నారు. 2001లో టీఆర్‌ఎస్ పుడితే 2002లో తాను పార్టీలో చేరానని, కేసీఆర్ ఏది ఆదేశిస్తే ఆ పని చేశానని, అలాంటి తనను పట్టుకుని.. ‘మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లాడు’ అని అంటారా..? అని ప్రశ్నించారు.
పెన్షన్, రేషన్‌కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతుల సమస్యలపై మాట్లాడుతున్నాననే కోపంతోనే తనను బర్తరఫ్ చేశారని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు ప్రాణాలకు తెగించి కొట్లాడామని, తమపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, జైళ్లలో మగ్గామని గుర్తు చేశారు. కేసీఆర్ ఒక్కనాడైనా జైలుకు వెళ్లాడా..? అని ప్రశ్నించారు. త్వరలోనే ఉద్యమకారులు, విద్యార్థులు, రైతులు, అమెరికాలో ఉన్న వారు ఇక్కడకు వచ్చి తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారని ఈటల వెల్లడించారు.