ప్రజాధనంతో టీఆర్‌ఎస్‌కు ప్రచారమా?
ABN , First Publish Date - 2021-08-17T08:58:05+05:30 IST
ప్రజల సొమ్ముతో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రచారం చేసుకుంటున్నారని, ఈ విషయమై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధనంతో సోకులు పడుతున్నారని, ఈ డబ్బుతో ఎన్నో పేద..
నియోజకవర్గంలో అక్రమంగా వేల మంది అరెస్టు
భయం గుప్పిట్లో హుజురాబాద్: ఈటల రాజేందర్
జమ్మికుంట, ఆగస్టు 16: ప్రజల సొమ్ముతో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రచారం చేసుకుంటున్నారని, ఈ విషయమై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధనంతో సోకులు పడుతున్నారని, ఈ డబ్బుతో ఎన్నో పేద కుటుంబాలు బాగుపడేవని అభిప్రాయపడ్డారు. సీఎం సభ నేపథ్యంలో అప్రజాస్వామికంగా వేల మందిని అరెస్టు చేశారని, వారిని పెట్టేందుకు పోలీస్ స్టేషన్లు, స్కూళ్లు సరిపోలేదని పేర్కొన్నారు. ఇంతటి నిర్బంధం ఎప్పుడూ చూడలేదని, హుజురాబాద్ భయం గుప్పిట్లో ఉందని వ్యాఖ్యానించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
వాసాలమర్రిలో ఇప్పటికే ప్రారంభించిన దళిత బంధు పథకానికి ఇంత ప్రచారం ఎందుకని ఈటల ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని, కలెక్టర్, అధికారుల ఆజమాయిషీ లేకుండా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సభకు నియోజకవర్గ ప్రజల నుంచి స్పందన లేకపోవడం వల్లే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి బస్సులు పెట్టి జనాలను సభకు తీసుకొచ్చారని ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. మీటింగ్ జరుగుతున్న ఊరికి కూడా బస్సులు పెట్టి జనాలను తీసుకుపోయే దుస్థితికి అధికార పార్టీ చేరుకుందని ఎద్దేవా చేశారు. సభకు జనాలను తరలించే బాధ్యతను ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, వీఆర్వోలు, వీఆర్‌ఏలకు అప్పగించారని దుయ్యబట్టారు. కడు పేదరికంలో ఉన్న దళిత కుటుంబాలను ఆదుకోవడానికి పెట్టిన పథకానికి ఇంత డబ్బు ఖర్చు చేసి ప్రచారం ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని సూచించారు.