టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో తెలంగాణ వ్యతిరేకులు

ABN , First Publish Date - 2021-12-15T06:06:28+05:30 IST

టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో తెలంగాణ వ్యతిరేకులు

టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో తెలంగాణ వ్యతిరేకులు
సమావేశంలో ప్రసంగిస్తున్న జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

ధాన్యంపై సీఎం కేసీఆర్‌ రాజకీయాలు  

ప్రపంచ దేశాలన్ని మోదీవైపు చూపు    

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ

మహబూబాబాద్‌ రూరల్‌, డిసెంబరు 14 : నాలుగున్నర కోట్ల ప్రజల పోరాటాలు... విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేకులు రాజ్యమేలుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన మానుకోట ఘటనలో తెలంగాణ వాదులపై రాళ్లు విసిరిన వారిని సీఎం కేసీఆర్‌ చంకలో పెట్టుకున్నారని విమర్శించారు. మహబూబాబాద్‌ ఎస్వీ బీఈడీ కళాశాలలో మూడ్రోజుల పాటు జరిగే బీజేపీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన డీకే.అరుణ మాట్లాడారు. సెంట్‌మెంట్‌తోనే సీఎం కేసీఆర్‌ బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. నాడు తెలంగాణ సెంట్‌మెంట్‌తో అధికారంలోకి రాగా, నేడు ఉత్తర, దక్షిణ భారత్‌లుగా వ్యత్యాసాలను చూపెడుతున్నారని మండిపడ్డారు. ధర్నాచౌక్‌ వద్ద ఆందోళన చేసే స్థాయికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగజారిపోయాడని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని, మూడు నెలల ముందే బాయిల్డ్‌ రైస్‌ తప్ప అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికి దానిని పక్కదోవ పట్టిస్తూ కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అరుణ విమర్శించారు.  హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ఓటమి చెందాక బీజేపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, దళితబంధు రాష్ట్రమంతా అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని నిలదీశారు. కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, శాంతి, రక్షణ ఎజెండాగా ముందుకు పోతున్న ప్రధాని మోదీ వైపు ప్రపంచ దేశాలన్ని చూస్తున్నాయని అరుణ అన్నారు.  కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.రాజవర్థన్‌రెడ్డి, రాచకొండ కొమురయ్య, జిల్లా ఇన్‌చార్జ్‌ కట్ల సుధాకర్‌రెడ్డి, యాప సీతయ్య, పెదగాని సోమయ్య, ఎడ్ల అశోక్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-15T06:06:28+05:30 IST