ఆగస్టుకల్లా బయొలాజికల్-ఈ వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-05-08T08:44:56+05:30 IST
కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ల కంటే తక్కువ ధరకే కరోనా టీకాను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన బయొలాజికల్-ఈ సిద్ధమవుతోంది.

- ఇప్పుడున్న కొవిడ్ టీకాల కంటే ధర తక్కువే
- ప్రతినెలా 8 కోట్ల డోసుల ఉత్పత్తి: మహిమ దాట్ల
హైదరాబాద్, మే 7 : కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ల కంటే తక్కువ ధరకే కరోనా టీకాను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన బయొలాజికల్-ఈ సిద్ధమవుతోంది. రీకాంబినంట్ ప్రొటీన్ రకానికి చెందిన వ్యాక్సిన్‌ను ఆగస్టుకల్లా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతినెల దాదాపు 7 నుంచి 8 కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం తమ కంపెనీకి ఉందని బయొలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వెల్లడించారు. తాము తెచ్చే టీకా తక్కువ ధరకే ప్రజలకు లభిస్తుందని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడే ధరకు సంబంధించిన వివరాలను ప్రకటించలేమని, ఆ అంశంపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. ఈ టీకాతో వివిధ రాష్ట్రాల్లోని 15 కేంద్రాల్లో 18-80 ఏళ్లలోపు 1,268 మంది వలంటీర్లపై మూడోదశ ప్రయోగ పరీక్షలను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అమెరికాలోని టెక్సా్‌సలో ఉన్న బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంయుక్త భాగస్వామ్యంతో బయొలాజికల్-ఈ కంపెనీ కొవిడ్ టీకాను అభివృద్ధిచేసింది. ఇందుకోసం హెపటైటి్‌స-బి టీకా తయారీ పద్ధతి ( రీకాంబినంట్ ప్రొటీన్ టెక్నాలజీ)నే వినియోగించారు. సంప్రదాయక పద్ధతిలోనే ఈ టీకాను బయొలాజికల్-ఈ ఉత్పత్తి చేయనుండటంతో, ఒక్కో డోసు తయారీ ఖర్చు దాదాపు రూ.110 దాటకపోవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అభివృద్ధిచేసిన సింగిల్ డోసు కరోనా టీకాకు చెందిన 60 కోట్ల డోసులను బయొలాజికల్-ఈ ఉత్పత్తి చేయనుంది. ఈమేరకు ఆ కంపెనీతో ముందస్తు ఉత్పత్తి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక అమెరికా ఇంటర్నేషనల్ డెవల్‌పమెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అందే ప్రత్యేక నిధులతో 2022 చివరికల్లా మొత్తం 100 కోట్ల జాన్సన్ అండ్ జాన్సన్ టీకా డోసులను తయారుచేయనుంది.