సంపూర్ణ శాకంబరీగా భద్రకాళి అమ్మవారు
ABN , First Publish Date - 2021-07-25T05:07:13+05:30 IST
సంపూర్ణ శాకంబరీగా భద్రకాళి అమ్మవారు

1200 కిలోల కూరగాయలతో అలంకరణ
వరంగల్ కల్చరల్, జూలై 24: జగన్మాత భద్రకాళి అమ్మవారు శనివారం సంపూర్ణ శాకంబరీగా దర్శనమిచ్చారు. పలురకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్త జనం అమ్మవారి దివ్యరూపాన్ని వీక్షించి తన్మయులయ్యారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఈ వేడుకతో భద్రకాళి ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దేవాలయంలో రెండు వారాలుగా నిర్వహిస్తున్న ఆషాఢమాస శాకంబరీ వేడుకలు శనివారం ముగిసాయి. ఈనెల 10న ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు నుంచి శాకంబరీ వేడుకలు ప్రారంభమయ్యాయి.
కాగా, తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి శాకంబరీ అలంకరణను ప్రారంభించారు. పూర్తిగా సేంద్రియ ఎరువులతో పండించిన సుమారు 1200 కిలోల కూరగాయలతో అమ్మవారిని శాకంబరీగా ఆరుగంటల పాటు అలంకరింపజేసి ఉదయం 9గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అప్పటికే ఆలయానికి పెద్దసంఖ్యలో చేరుకున్న భక్తులు.. ‘భద్రకాళి శరణం మమః, శాకంబరీ మాతాకు జై’ నినాదాలతో ఆలయం ప్రతిధ్వనించింది. ఆలయ ప్రాంగణాన్ని కూడా కూరగాయాలతో శోభాయమానంగా అలంకరించారు.
శాకంబరీ అలంకరణ ప్రముఖ కాంట్రాక్టర్ డాక్టర్ మండువ శేషగిరిరావు-రేణుక దంపతులు, హైదరాబాద్‌కు చెందిన ఇమ్మడిశెట్టి హరికృష్ణ-స్మిత దంపతుల సౌజన్యంతో జరిగింది. మహబూబాబాద్ లక్ష్మీవెంకటేశ్వర సేవా సమితి వారు 30మంది అమ్మవారి సన్నిధిలో భక్తులకు క్యూలైన్‌లో సేవలు అందించారు. భద్రకాళి సేవా సమితి కన్వీనర్ అయితా గోపీనాఽథ్ ఆధ్వర్యంలో పలువురు భక్తులు ప్రసాద వితరణ జరిపారు.
ఆలయాన్ని సందర్శించిన ప్రముఖుల్లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు ఉన్నారు. ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యం లో వైదిక కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ ఈవో, జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ ఆర్.సునిత వేడుకలను పర్యవేక్షించారు. రాత్రి 9 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
