ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు

ABN , First Publish Date - 2021-05-30T08:08:14+05:30 IST

సీఎం కేసీఆర్‌ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు

వ్యాక్సిన్‌ పంపిణీలో కేంద్రం విఫలం: ఎర్రబెల్లి  

హన్మకొండ అర్బన్‌/వర్ధన్నపేట, మే 29: సీఎం కేసీఆర్‌ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందుతున్నాయని మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది అంకితభావం, చిత్తశుద్ధితో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించాలని సూచించారు. ఎంజీఎంలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం 50 పడకలతో కూడిన వార్డును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఎంజీఎంలో రోగులకు అందుతున్న సేవలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయన్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వకుండా ఇతర దేశాలకు పంపించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. తెలంగాణలో తయారవుతున్న వ్యాక్సిన్‌ను ఇక్కడి ప్రజలకే మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-05-30T08:08:14+05:30 IST