ఆమె ఆత్మహత్య వెనుక?
ABN , First Publish Date - 2021-08-25T09:04:58+05:30 IST
తరగతులు అర్థం కావడం లేదేమో అనుకుంటే ఆమె చదువులో మహా చురుకు.

- హెచ్‌సీయూలో మౌనిక బలవన్మరణంపై సస్పెన్స్
- కాల్‌డేటా కీలకం! ఫోరెన్సిక్‌కు మొబైల్, ల్యాప్‌టాప్
- ఆమె ధైర్యవంతురాలు.. చనిపోయేంత ఇబ్బందుల్లేవు
- మరణించిన 19 గంటల వరకూ గుర్తించరా?
- వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి
- మృతురాలి తండ్రి లచ్చయ్య డిమాండ్.. కన్నీరుమున్నీరు
- చదువులో మహా చురుకు.. వివాదాలకు దూరం
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తరగతులు అర్థం కావడం లేదేమో అనుకుంటే ఆమె చదువులో మహా చురుకు. కుటుంబ సమస్యలేమైనా ఉన్నాయేమో అనుకుంటే తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి 10 రోజుల క్రితమే హాస్టల్‌కు వచ్చింది. కాలేజీలో తోటి విద్యార్థులతోనూ ఆమెకు ఎ లాంటి గొడవలు లేవు. వివాదాలకు ఎప్పుడూ దూరం. అలాంటిది.. తన హాస్టల్ గదిలో స్కార్ఫ్‌తో ఉరి వేసుకుంది. ఉన్నత చదువు కొనసాగిస్తూ మహోజ్వల భవిష్యత్తున్న ఆ విద్యా కుసుమం ఎందుకు తన జీవితాన్ని అంతం చేసుకున్నట్లు? ఆమెను ఆత్మహత్య దిశగా ఉసికొల్పిన ఆ కారణం ఏమై ఉంటుంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఎంటెక్ నానో సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 27 ఏళ్ల మౌనిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఇప్పుడివే అనుమానాలు నెలకొన్నాయి హెచ్‌సీయూ హాస్టల్ గదిలో సోమవారం రాత్రి 7:30 గంటలకు మౌనిక, తన గదిలోని కిటికీ గ్రిల్స్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించడం సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా శ్రీరామ్‌పూర్ మండలం తారుపల్లికి చెందిన లచ్చయ్య రైతు. ఆయనకు ఇద్దరు కూతుళ్లలో మౌనిక చిన్నది. ఉన్నత చదువు కోసం హెచ్‌సీయూలో చేరింది. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సొంతూరికి వెళ్లింది. ఇటీవల కాలేజీలు ప్రారంభంకావడంతో ల్యాబ్ క్లాస్‌లకోసం ఈ నెల 13న తిరిగి వర్సిటీకొచ్చింది. నిబంధనల ప్రకారం.. వారంపాటు క్యాంరటైన్‌లో ఉంది. 19 నుంచి హాస్టల్‌లోని తన గదిలో ఉంటోంది. ప్రతి గదిలో ఇద్దరు విద్యార్థులుంటారు. ఆమె రూ మ్మెట్ ఇంకా వర్సిటీకి రాకపోవడంతో మౌనిక ఒంటరిగానే ఉంటోంది. 22న రాఖీ పౌర్ణమి రోజు ఓ స్నేహితురాలితో కలిసి బయటకు వెళ్లి, తిరిగి తన గదికొచ్చింది. రాత్రి తన స్నేహితురాలితో ఫోన్ మాట్లాడి, 11:30కు గుడ్‌నైట్ అని మెసేజ్ పెట్టింది. మరుసటి రోజు మౌనిక గది తలుపులు తెరుచుకోలేదు. టిఫిన్, భోజనం చేసేందుకు, ల్యాబ్ క్లాసుల కోసం ఆమె బయటకు రాలేదు. స్నేహితులు ఎన్నోసార్లు ఫోన్ చేసినా తీయలేదు. అనుమానం వచ్చిన ఇద్దరు స్నేహితులు, సాయంత్రం 6:30కు మౌనిక గది వద్దకు వెళ్లారు. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా పలుకే లేదు. మరికొందరు వచ్చి గట్టిగా తలుపును నెట్టడంతో పైన ఉన్న గడియ ఊడిపోయింది. రాత్రి 7:30కు లోపలికి వెళ్లి చూసి అంతా షాక్ అయ్యారు. కిటికీ గ్రిల్స్‌కు తన స్కార్ఫ్‌తో మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.
పెళ్లి ప్రస్తావన తెస్తే తిరస్కరణ
గతంలో ఒకట్రెండుసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు తనకు చాలా భవిష్యత్తు ఉందని, ఇప్పుడే పెళ్లి వద్దని తమతో చెప్పిందని మౌని క తండ్రి లచ్చయ్య చెప్పారు. వారం క్రితం ఇంటి నుంచి కాలేజీకి ఆమె వచ్చేటప్పుడు కూడా ఎలాంటి పెళ్లి ప్రస్తావన రాలేదని వెల్లడించారు. ‘చాలా పెద్ద కాలేజీ అన్నారు.. నీ బిడ్డ పెద్ద చదువు చదువుతోంది చాలా అదృష్టవంతురాలు అని అందరూ అంటుంటే మురిసిపోయాను. కానీ ఇంతపెద్ద కాలేజీలో నా కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు. చనిపోయి 19 గంటలు దాటినా ఏ ఒక్కరూ పట్టించుకోలేని దుస్థితి ఉంటుందని అనుకోలేదు’ అంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం లచ్చయ్య బోరున విలపించారు. తన కూతురు ధైర్యం కలదని, ఆత్మహత్య చేసుకునేంత ఇబ్బందులు, బాధలు ఏమీ లేవని చెప్పారు. యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్లే తన కూతురు మృతి చెందిందని ఆరోపించారు. యూనివర్సిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సూసైడ్ నోట్‌లో ఏముంది?
మౌనిక గదిలో మూడు లైన్ల సూసైడ్ నోట్ లభించింది. ‘ఐయామ్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఐయామ్ నాట్ గుడ్ డాటర్, ఐయామ్ సారీ అమ్మా నాన్న, లవ్‌యూ ఆల్, మిస్ యూ శాన్వి (అక్క కూతురు)’ అని అందులో ఉంది. తన ఫోన్లో మరొకరితో ఆమె సెల్ఫీ బయటకొచ్చినా ఆ వ్యక్తి మొహం కనిపించడం లేదు. అతను ఎవరనేది తేల్చేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మౌనిక సెల్‌ఫోన్, ల్యాప్‌టా్‌పను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, ఆమె చనిపోయిన 19 గంటల వరకూ ఎందుకు గుర్తించలేకపోయారనే కోణంలోనూ విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు.
బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదివి..
మౌనిక స్నేహితులను పోలీసులు విచారించగా మౌనిక చదువులో చాలా చురుకైన అమ్మాయి అని చెప్పారు. ఆమె బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేసిందని, ఎంటెక్‌లో ఎంతో కష్టమైన నానో సైన్స్‌లో సీటు సాధించిందని తెలిపారు.